ఏపీలో ఒంటరిగా పోటీ చేయడం లేదా బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయడం చేస్తే రూ. వెయ్యి కోట్లు అయినా సరే ఎన్నికల ఖర్చు అంతా భరిస్తానని కేసీఆర్ .. జనసేనానికి ఆఫర్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే బయట పెడితే సంచలనం అయింది. ఆయనను తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నలిస్ట్ అయిన రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా అదే చెబుతున్నారు. బీజేపీపై పోరాడే ప్రంట్కు చైర్మన్గా తనను చేస్తే … ఆ కూటమిలో ఉన్న పార్టీల ఎన్నికల ఖర్చు అంతా తాను పెట్టుకుంటానని ఆఫర్ ఇచ్చారని రాజ్ దీప్ సర్దేశాయ్ స్పష్టం చేశారు.
తన చానల్లో ఆయన దేశ రాజకీయాలపై ఓ విశ్లేషణాత్మక వీడియో చేశారు. ఇందులో కేసీఆర్ వ్యూహాల గురించి వివరించారు. కేసీఆర్ చేసిన డబ్బుల ఆఫర్ గురించి కూడా వివరించారు. అయితే ఆయా పార్టీలు డబ్బులతో రాజకీయాలు కావని అనుకున్నారేమో కానీ ఎక్కువ మంది స్పందించలేదు. కానీ కేసీఆర్ చేసిన ఆఫర్ మాత్రం టాం టాం అవుతోంది. ఇప్పటికే కేసీఆర్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణలో దోచుకుని దాన్ని దేశంలో ఎన్నికలపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారని మండిపడుతున్నారు.
మరో వైపు ఇప్పటికే కేసీఆర్ అనేక ప్రాంతీయ పార్టీలకు ఫండింగ్ ఇస్తానని హామీ ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఆర్థిక సాయం చేశారని కూడా అంటున్నారు. ఇంత డబ్బు కేసీఆర్కు ఎక్కడి నుంచి వచ్చిందని కేంద్ర ఏజెన్సీలు కూడా ఆరా తీస్తున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.