తమిళనాడు ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలన్నీ రజనీకాంత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే, ఆయన త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా రజనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం ఒక కొలీక్కి రావాలంటే మరో పవర్ ఫుల్ లీడర్ వేదిక మీద కనిపించాల్సిందే అనడంలో సందేహం లేదు. అమ్మ జయలలిత మరణం తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు కుక్కలు చింపిన విస్తరిలా మారాయి. రజనీ రాకతోనే పరిస్థితులు మారతాయంటూ తమిళనాట ఒక బలమైన అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయితే, పార్టీ ప్రకటనపై రజనీ నేరుగా స్పందించింది లేదగానీ, ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నట్టుగానే తెలుస్తోంది.
ప్రస్తుతం రజనీకాంత్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. రోబో 2, కాలా చిత్రాల షూటింగుల్ని డిసెంబర్ లోగా పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 12 నాటికి సినిమాల పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అదే రోజున రజనీకాంత్ పార్టీ ప్రకటన అధికారికంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మధ్య అభిమానులతో జరిగిన ఓ ఫోటో సెషన్ కూడా పార్టీ ఏర్పాటుకు సంబంధించి రజనీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ‘సమరం వచ్చినప్పుడు చూసుకుందాం, పోరాటానికి సిద్ధంగా ఉండండి’ అంటూ అభిమానులకు పిలుపు నిచ్చారు. ఈ ప్రకటనతో రజనీ రాజకీయ అరంగేట్రం దాదాపు కంఫర్మ్ అనే అనుకోవచ్చు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి క్షేత్రస్థాయి పనుల్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించినట్టు కూడా తెలుస్తోంది. పార్టీ ప్రకటన నాడు ఎలాంటి ఈవెంట్స్ ఉండాలనే ప్లానింగ్ కూడా జరుగుతోందట.
మొత్తానికి, సూపర్ స్టార్ పక్కా ప్లానింగ్ తోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తమిళనాట కొన్ని చిన్న పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పెద్ద పార్టీలు ఇంకా ఎలాంటి కామెంట్స్ చెయ్యడం లేదు. కానీ, జాతీయ పార్టీ భాజపా నుంచి ఆయనకి స్నేహ హస్తం అందుతుందనే ప్రచారమూ తమిళనాట ఉంది. ఎలాగోలా తమిళనాడు రాజకీయ పగ్గాలను అందుకోవాలని భాజపా అర్రులుచాస్తున్న సంగతి తెలిసిందే. సో.. రజనీ పార్టీతో సత్సంబంధాల కోసం ఇప్పట్నుంచే కమలనాధులు ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు! ఏదేమైనా, ఆయన పార్టీ ప్రకటనకు మూహూర్తం డిసెంబర్ 12 అని తమిళనాట ప్రచారం మొదలైంది. పార్టీ ఏర్పాట్లలో భాగంగా కొంతమంది ప్రముఖులతో కూడా రజనీకాంత్ సమావేశాలు అవుతున్నారనీ తెలుస్తోంది! సో… హ్యాపీ దివాలీ ఫోక్స్.