రేటింగ్: 1.5
కాన్సెప్ట్ కథల్లో సుఖం ఉంది… కష్టమూ ఉంది.
కాన్సెప్ట్ క్లిక్కయితే.. దాన్ని సరిగా వాడుకునే తెలివితేటలుంటే.. ఏంతైనా మ్యాజిక్ చేయొచ్చు. ఓ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్లా.
అదే.. కాన్సెప్ట్‌లో క్లారిటీ లేకపోతే, దాన్ని రెండు గంటల సినిమాగా మలిచే టాలెంట్ లేకపోతే, ఆ కాన్సెప్ట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే… ఆ సినిమా చీదేస్తుంది.
‘రాజుగాడు’లా.
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు – ఈ రెండు సినిమాల్ని అందించిన మారుతి… ‘రాజుగాడు’ కాన్సెప్ట్‌కి సృష్టి కర్త. మారుతి ఈ సినిమాని తీసుంటే ఎలా ఉండేదో తెలీదు గానీ – ఇప్పుడు మాత్రం ‘రాజుగాడు’ తన కాన్సెప్ట్‌కి న్యాయం చేయలేక – మ్యాజిక్‌ని రిపీట్ చేయలేక – బాక్సాఫీస్ ముందు క్లూ లెస్‌గా నిలబడిపోయింది.
కథ
రాజు (రాజ్‌తరుణ్)కి చిన్నప్పటి నుంచి క్లెప్టో్మియా అనే విచిత్రమైన జబ్బు ఉంటుంది. తనకి తెలియకుండానే తన చేయి దొంగతనాలు చేసేస్తుంటుంది. ఆ జబ్బు తనతో పాటు పెరిగి పెద్దదవుతుంది. రాజు ఓ దొంగ అని తెలిసి.. తను ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవుతుంది. ఇక ఏ అమ్మాయినీ ప్రేమించకూడదు అనుకుంటున్న తరుణంలో తన్వి (అమైరా దస్తూర్)ని చూస్తాడు. మరుక్షణం నుంచి ప్రేమలో పడిపోతాడు. తన జబ్బు గురించి చెబితే ఆ అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందో అని… ఆ విషయాన్ని దాచేస్తాడు. తన్వి ఇంట్లో వాళ్లు కూడా రాజు – తన్విల పెళ్లికి ఒప్పుకుంటారు. కాకపోతే ఒక్కటే షరతు. రామాపురంలో ఉంటున్న తాతయ్య (నాగినీడు) కి కూడా నచ్చాలంటారు. అందుకోసం రామాపురం వెళ్తాడు రాజు. అయితే.. తన్వి తాతయ్యకు దొంగలన్నా, దొంగతనాలన్నా అసహ్యం. ఆ ఊర్లో ఎవరు దొంగతనం చేసినా వాళ్ల చేతుల్ని నరికేస్తుంటాడు. అలాంటి ఇంట్లో చేయితిరిగిన దొంగ.. రాజు అడుగుపెడతాడు. అప్పుడేమైంది? తన జబ్బుని కప్పుపుచ్చుకోవడానికి రాజు ఆడిన నాటకాలేంటి? తాతయ్యనీ, ఇంట్లోవాళ్లనీ ఒప్పించి తన్విని పెళ్లి చేసుకున్నాడా, లేదా? అనేదే కథ
విశ్లేషణ
ఓ కాన్సెప్ట్ ప్రకారం నడిచే కథ ఇది. కాబట్టి లాజిక్కులు గురించి పట్టించుకోకూడదు. కాన్సెప్టే బలం. కాబట్టి… అది ఎలా ఉన్నా సరే – స్వీకరించాల్సిందే. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు కూడా చిన్న చిన్న కాన్సెప్టులే. అవి విజయం సాధించాయి కదా? క్లెప్టోమేనియా పాయింట్‌ని కూడా సరిగా డీల్ చేయొచ్చు. అందులోంచి బోలెడంత వినోదం పిండొచ్చు. కానీ… దర్శకురాలిలో ఆ సత్తా ఉండాలి. దురదృష్టం ఏమిటంటే… ఆ ప్రతిభ సంజనలో కనిపించలేదు. ఇదే కథని మారుతి అయితే ఎలా ట్రీట్ చేసుంటాడో తెలీదు గానీ – సంజన మాత్రం న్యాయం చేయలేకపోయింది. కథకి కాన్సెప్ట్ ఒక్కటే సరిపోదు. వినోదం, బలమైన ఎమోషన్, విచిత్రమైన పాత్రలూ కావాలి. అవి అందించడంలో సంజన విఫలమైంది. సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరో ఏంటి? ఏం చేస్తుంటాడు? అతని బలహీనత ఏంటి? అనేది అర్థమైపోతుంది. తొలి పదినిమిషాల ఫన్‌కి అది సరిపోతుంది. ఆ తరవాతేంటి? అస్తమానూ అవే దొంగతనాలు, అవే కవరింగులూ చూపించలేం కదా? అందుకే ‘బాంబు’ ఎపిసోడ్, తాతయ్య పరీక్ష అనే పాయింట్లు రాసుకున్నారు.
కానీ ఆ రెండింటినీ చాలా పేలవంగా తీర్చిదిద్దారు. వంద కోట్ల విలువైన బాంబుని చూస్తే… బీసీ కాలం నాటి సినిమాలు, అప్పుడు అమర్చిన టైం బాంబులు గుర్తొస్తాయి. ఆ సన్నివేశాల్ని లాజిక్‌కి ఎంత దూరంగా చూపించారో గ్రఃహిస్తే.. నవ్వొస్తుంది. హైదరాబాద్‌ని అతలాకుతలం చేసే బాంబుని టెర్రరిస్టు జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. అది హీరోకి చేరిన విధానం ఇంకా దారుణంగా ఉంటుంది. నాగినీడు ఇంట్లో పాత్రలు, వాటి చుట్టే పండే వినోదం..కనీసం ఇవి బాగున్నా – రాజుగాడు టైమ్ పాస్ ఇచ్చేద్దుడు. కానీ.. అక్కడి వ్యవహారాలు మరింత నీరసంగా నడిచాయి. ద్వితీయార్థంలో షాపింగ్ మాల్ ఎపిసోడ్ అయితే.. ఎంతకీ అయిపోదు. కథ లేకపోవడం, కాన్సెప్ట్‌ని పట్టుకుని రంగంలోకి దిగిపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి. క్లైమాక్స్‌లో అయితే ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందుకే భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రాజా ది గ్రేట్ పాత్రల డూప్‌లను రంగంలోకి దింపాడు. వాళ్ల కామెడీ ఈ సినిమాపై గౌరవార్ని మైనస్‌లోకి తీసుకొచ్చేస్తుంది. సినిమా చూడడానికి ప్రేక్షకుడు ఎంత కష్టపడ్డాడో, ఈ సినిమాని ఎలాగైనా ముగించాలని దర్శకురాలు అంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటుంది. అందుకే.. పతాక సన్నివేశాల్ని, అంతకు ముందు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని చుట్టి అవతల పారేసింది.
నటీనటులు
రాజ్ తరుణ్ మంచి నటుడే. కానీ ఈమధ్య మరీ పేలవమైన కథల్ని ఎంచుకుంటున్నాడు. మరోసారి తన జడ్జిమెంట్ తప్పింది. నటనలోనూ మెరుపులు లేవు. ఇది వరకటితో పోలిస్తే… అతని హుషారు తగ్గిపోయింది. బహుశా పాత్రని సరిగా డీల్ చేయలేకపోవడం వల్లేమో. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు ఓవర్ యాక్షన్ చేస్తే అస్సలు చూడలేం. ఆ ప్రమాదం ఈ సినిమాలో ఎదురైంది. అమైరా దస్తూర్‌ని ఎవరో ‘నువ్వు నవ్వితే బాగుంటావు’ అని పొరపాటున చెప్పి ఉంటారు. ఈ సినిమాలో తన పళ్లన్నీ కనిపించేలా నవ్వుతూనే కనిపిస్తుంది. ఒక్కోసారి ఫేస్ వెలిగిపోతుంటే… ఒక్కోసారి మాడిపోయినట్టు కనిపించింది. రావు రమేష్ ఎప్పట్లా.. తన వరకూ న్యాయం చేసుకున్నాడు. మిగిలిన వాళ్ల గురించి చెప్పుకొనే అవకాశం, అవసరం లేకుండా ఆయా పాత్రల్ని తీర్చిదిద్దాడు దర్శకుడు.
సాంకేతిక వర్గం
కొన్ని కాన్సెప్టుల వరకే బాగుంటాయి. తెరపైకి తీసుకురావడం కష్టం.. అని నిరూపించిన సినిమా ఇది. చిన్న కాన్సెప్ట్‌కి బలాన్నిచ్చేలా సన్నివేశాలు, సంఘటనలూ లేవు. రచయిత, దర్శకురాలు ఇద్దరూ దీనికి బాధ్యులే. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటలు సరిగా పేలలేదు. ఇలాంటి సినిమాల్ని హిలేరియస్‌గా తీర్చిదిద్దాలి. అలాంటి ఎపిసోడ్ ఒక్కటీ ఈసినిమాలో కనిపించదు.
తీర్పు
మనిషిలోని బలహీనతని, రోగాన్నీ నవ్వులతో కప్పేసి – వినోదాత్మకంగా తీర్చిదిద్దడం ఎలాగో మనవాళ్లు బాగా నేర్చుకున్నారు. అయితే ఆ బలహీనతని కప్పిపుచ్చే బలం ‘కథనం’లో ఉండాలి. దానిలో దమ్ము లేకపోతే… రాజుగాడు లాంటి తలనొప్పులు తగులుతూనే ఉంటాయి. హీరోకి అసలే జబ్బు.. దానికి టానిక్ ఇచ్చే మందులో ఉండాలి. ఆ మందు డూప్లికేట్ అయిపోయింది పాపం. ఫృథ్వీ చేసిన ప్రయోగంలా… దర్శకురాలు చేసిన ప్రయత్నం వికటించింది.
ఫినిషింగ్ టచ్: ‘భలే భలే మగాడివోయ్’ తీయబోతే.. ‘ఒక్క మగాడు’ వచ్చింది
రేటింగ్: 1.5