తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజీనామా చేశారు. త్వరలోనే ఎన్నిక జరగనుంది. ఆయన పదవి కాలం మరో మూడేళ్లు ఉంది. ఎమ్మెల్యేల పరంగా టీఆర్ఎస్కుతిరుగులేని ఆధిక్యత ఉంది కాబట్టి టీఆర్ఎస్ నేతే ఎంపీ అవుతారు. బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీ చేసిన సమయంలో ఆ స్థానాన్ని కవితకు ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ కవిత రాష్ట్రంలోనే రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె మాటను కేసీఆర్ కాదనలేకపోయారు. అందుకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బండ ప్రకాష్ ఖాళీ చేసిన స్థానం ఎవరికి ఇస్తారన్నదానిపై టీఆర్ఎస్లో చర్చ ప్రారంభమయింది.
ఈ మూడేళ్ల రాజ్యసభ స్థానం కోసం చాలా మంది రేసులోఉన్నారు. ఖమ్మం నుంచి తుమ్మలనాగేశ్వరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికసంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వంటి సీనియర్లు రేసులో ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి పని చేసిన మరికొంత మంది నేతలూ తమకు చాన్సివ్వాలని కోరుతున్నారు. అయితే కేసీఆర్ ఎవరికి చాన్సిస్తారన్నదానిపై బయటకు చెప్పకపోయినా.. ఈ సారి కూడా బంధువులకే ఇస్తారన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.
నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావును కేసీఆర్ ఖరారు చేస్తారని అంటున్నారు. గత సంవత్సరమే రాజ్యసభకు పంపిస్తామని ఆయనకు హామీ ఇచ్చినప్పటికీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవకాశం కల్పించలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తన బంధువు సంతోష్ రావును కేసీఆర్ రాజ్యసభకు పంపారు. ఇప్పుడు దామోదర్ రావును కూడా రాజ్యసభకు పంపితే.. కుటుంబానికి పదవులు అనే విమర్శలు మరింత పెరుగుతాయి.