ఊరు వరదల్లో ఉంటే గ్రామ పెద్ద జల్సాలు చేస్తున్నట్లుగా ఉంది ఇద్దరు ఎన్నారై ఎమ్మెల్యేల తీరు. వీరిద్దరూ ఏదో సాధించేసినట్లుగా అమెరికాలో వాలిపోయి ర్యాలీలు చేసేస్తున్నారు. అది కూడా తాము ఎక్కడ ఉపాధి పొందామో ఆ ఊళ్లో కాదు.. తెలుగువాళ్లు కాస్త ఎక్కువగా ఉన్న చోటల్లా పిలిపించుకుని మరీ ర్యాలీలు చేస్తున్నారు. మిగతా వాళ్లు వీళ్లు అంతగా ఏం సాధించారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇంత హంగామా ఎందుకని ఆశ్చర్యపోతున్నారు.
గాల్లోనే ఉన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టిక్కెట్ దక్కుతుందా లేదా అని చాలా టెన్షన్ పడి చివరికి ఎలాగోలా దక్కించుకున్నారు. ఆయన అత్యంత గడ్డు పరిస్థితుల నుంచి మంచి మెజార్టీతో విజయం సాధించారు. అందు కోసం ఆయన కష్టపడ్డారు. అక్కడి ప్రజలు ఆదరించారు. కానీ ఆయన చేయాల్సిన విజయ యాత్రలు అయినా.. సేవలు అయినా గుడివాడలోనే. మరి అమెరికాలో ఎందుకు చేస్తున్నారు ?. గుడివాడలో గుడ్లవల్లేరు కాలేజీ వ్యవహారం సంచలనం రేపింది. ఆ సమయంలో ఎమ్మెల్యే లేకపోవడంతో వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంది. ఇప్పుడు వరద ముప్పు వచ్చింది. ఆయన మాత్రం అమెరికాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏదో ఒక చోట అయితే అనుకోవచ్చు…. కానీ ఆయన నేల మీదకు దిగడం లేదు.
ఉదయగిరి ఎమ్మెల్యేదీ అంతే !
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎన్నారై కోటాలో టిక్కెట్ దక్కించుకున్నారు. కొద్దిగా రిజర్వుడుగా ఉంటారని ఫీడ్ బ్యాక్ ఉన్నా చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. గాల్లో గెలిచేశారు. నిజానికి ఉదయగిరి ఏపీలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటి. వలస ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం అక్కడ పూర్తి స్థాయిలో కృషి చేయకుండా ఆయన అమెరికాలో వరుసగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలుగు వాళ్లు ఎక్కువ ఉన్న ప్రాంతాలను ఎంచుకుని పిలిపించుకుని మరీ ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు. ఇలాంటి ఆర్భాటాలు వదిలేసి ప్రజల్లో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు
చంద్రబాబు సింపుల్ అంటే.. వీళ్లు హెలికాఫ్టర్లతో పూలు చల్లించేసుకుంటున్నారు !
ఈ ఇద్దరు ఎమ్మెల్యేల హంగామా కొద్ది స్థాయిలో లేదు .. భారీగా ఉంది. మంచి పీఆర్ ఏజెన్సీని కూడా పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. తమపై హెలికాప్టర్లతో పూలు చల్లించే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలను నేల మీద ఉండాలని..అతి చేయవద్దని చాలా సార్లు హితబోధ చేశారు. కానీ తాము ఏదో కొండెక్కిసినట్లుగా.. ప్రపంచకప్ గెలిచేసినట్లుగా… ఇతర దేశాల్లో ర్యాలీలు నిర్వహించేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు
ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు నియోజకవర్గ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా గుడివాడ, ఉదయగిరి వంటి నియోజకవర్గాల్లో వారు చేయాల్సింది చాలా ఉంది. వారి గోస వినకుండా గెలిచిన రెండు నెలల్లోనే అమెరికా వెళ్లి పోయి.. అక్కడ ఏదో తాము పెద్ద విజయాలు సాధించేశామన్నట్లుగా ర్యాలీలు చేస్తున్నారు. నిజానికి ఎన్నికల్లో గెలుపు అసలు గెలుపు కాదు.. ప్రజలు నమ్మకంతో ఇచ్చి నగెలుపు.. అంటే ప్రజల గెలుపు. ఆ ప్రజల కోసం ఏదైనా సాధించిన తర్వాత వారు ఇలా ర్యాలీలు చేయించుకుంటే అందరూ అభినందిస్తారు కూడా.
ఇతర ఎమ్మెల్యేలు జాగ్రత్తపడాలి !
ఎన్నికల్లో టీడీపీకి గెలుపు రావడానికి ఎంత కష్టపడ్డారో వారికీ తెలుసు. అంతకు ముందు ఎన్ని కష్టాలు అనుభవించారో కూడా తెలుసు అందుకే ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఇష్టారీతిన అమెరికాలో హంగామా చేయడం కన్నా ముందు ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాల్సి ఉంది.