ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి రీ ఎంట్రీ… కొణిదెల ప్రొడక్షన్స్ ఆవిర్భావం ఒకేసారి జరిగిపోయాయి. తండ్రితో ఓ సినిమా చేయాలన్న కల.. చరణ్‌కి అలా తీరింది. సైరా కూడా కొణిదెల ప్రొడక్షన్ లోనే వచ్చింది. ఇప్పుడు ఆచార్య కూడా అంతే. కాకపోతే.. ఈసారి మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యం అవసరమైంది. `డాడీ సినిమాలన్నీ ఇక సొంత బ్యానర్లోనే చేస్తా` అని చెప్పిన చరణ్.. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న ఏ సినిమాకీ ప్రొడక్షన్ సైడ్ లేడు. అవన్నీ వేర్వేరు నిర్మాణ సంస్థలు రూపొందిస్తున్నాయి. నిర్మాణ పరంగానూ.. కొణిదెల ప్రొడక్షన్స్‌కి కాస్త బ్రేక్ ఇవ్వాలని చరణ్ నిర్ణయించుకున్నాడు.
“ఇప్పుడు నా చేతిలో వరుసగా సినిమాలున్నాయి. ఈ పరిస్థితిలో ప్రొడక్షన్ పనులు చూసుకోలేను. `ఆచార్య`లో మాట్నీ ని భాగస్వామిగా చేసుకొన్నది అందుకే. ఆ బాధ్యతలు నేనొక్కడినే చూసుకోలేకపోవడం వల్ల మాట్నీతో కలిశాం. ఇక మీదట.. కథ బాగా నచ్చి, ఈ సినిమాని వదులుకోకూడదు అనిపిస్తే.. ఆ సినిమాలో భాగస్వామిగా ఉంటాను. అలా చేయడం వల్ల… నిర్మాతకు బడ్జెట్ లో వెసులుబాటు ఉంటుంది. ఖర్చంతా పారితోషికాలపై కాకుండా సినిమాపై పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మంచి సినిమాలొస్తాయి..“ అని చెప్పుకొచ్చాడు చరణ్. అంటే.. కొణిదెల ప్రొడక్షన్ ఇప్పుడు సోలోగా సినిమాలు చేయదు. చరణ్ చేసే సినిమాల్లో భాగస్వామిగా ఉంటుందంతే. చిరుతో సినిమాలు చేసే విషయంలోనూ చరణ్ వెనక్కి తగ్గాడు. కాకపోతే.. బాబాయ్ పవన్ కల్యాణ్ తో మాత్రం ఓసినిమా చేయాలన్నది చరణ్ ఆశ. “నా బ్యానర్లో పవన్ బాబాయ్.. ఆయన బ్యానర్లో నేనూ సినిమాలు చేయాలి.. అదెప్పుడు కుదురుతుందో చెప్పలేను.. నేను మాత్రం బాబాయ్ తో ఓ సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా“ అనిచెప్పుకొచ్చాడు చరణ్.