మెగా కుటుంబంలో చిరంజీవి పెద్దన్న. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ మొదలుకుని రెండో తరం మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితరుల వరకూ చిరంజీవి కనుసన్నల్లో సినీ ప్రయాణం మొదలు పెట్టారు. ఒకప్పుడు తమ కుటుంబ కథానాయకులు చేసే కథలు వినడం, దర్శక నిర్మాతలతో మాట్లాటం వంటివన్నీ చిరంజీవి చేసేవారు. ఇప్పటికీ కొన్ని కథలు వింటున్నారు. చరణ్ సినిమాల విషయంలో అయితే ఆయన ఆమోదముద్ర తప్పనిసరి. మరి, మిగతా హీరోల సంగతేంటి? ఒకప్పుడు చిరంజీవి పోషించిన పెద్దన్న పాత్రను రామ్ చరణ్ భర్తీ చేస్తున్నాడు. చిరంజీవి సినిమాల విషయంలోనూ రామ్ చరణ్ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి.
ప్రస్తుతం మెగా కుటుంబంలో మొదలైన కొత్త సినిమాల వెనుక రామ్ చరణ్ వున్నాడు. చిరంజీవి-కొరటాల శివ, చిరంజీవి-త్రివిక్రమ్, వైష్ణవ్ తేజ్-సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు-మైత్రీ మూవీ మేకర్స్, సాయిధరమ్ తేజ్-కిశోర్ తిరుమల ‘చిత్రలహరి’… ఈ కాంబినేషన్లు సెట్ కావడం వెనుక రామ్ చరణ్ వున్నాడు. తనతో ‘ధ్రువ’ చేసిన సురేందర్ రెడ్డి ‘సైరా నరసింహారెడ్డి’ దర్శకుడు కావడం వెనక రామ్ చరణ్ చాలా కృషి చేశారు.
రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని కొరటాల శివ ప్రయత్నించాడు. చివరికి, చిరుతో చేస్తున్నారు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ అవకాశం రావడంతో చిరు-కొరటాల కాంబినేషన్ సెట్ చేశాడు చరణ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే చిత్రానికి డివివి దానయ్యను నిర్మాతను చేసిందీ చరణే. ఈ విషయాన్ని ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి స్వయంగా చెప్పారు. ‘రంగస్థలం’తో సుకుమార్, మైత్రీ నిర్మాతలకు దగ్గరయ్యాడు చరణ్. వెంటనే మైత్రిలో సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సినిమాలు సెట్ చేశాడు. సుకుమార్ శిష్యుణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ వైష్ణవ్ తేజ్ సినిమా చేయడం వెనుక కూడా రామ్ చరణ్ నిర్ణయం ప్రభావితం చేసింది. అంతకు ముందు కిశోర్ పార్ధసాని దర్శకత్వంలో వైష్ణవ తేజ్ ను హీరోగా పరిచయం చేయాలనుకున్నారు. ఆ సినిమా స్థానంలో బుచ్చిబాబు సినిమా వచ్చింది. ఇక వరుణ్ తేజ్ కూడా ‘అంతరిక్షం’ చేయాలా? వద్దా? అని సంశయంలో ఉన్నప్పుడు చరణ్ సలహా తీసుకున్నాడు. ఇలా మెగా హీరోలు చేసే సినిమాలు వెనుక రామ్ చరణ్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. మెగా నిర్ణయాలపై రాంచరణ్ ముద్ర స్పష్టంగా కనబడుతోంది. ఇతర హీరోలతో సన్నిహితంగా మెలుగుతూ అందరి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.