పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్లన్నీ ఒకే పేట్రన్లో జరుగుతుంటాయి. హీరో మాట్లాడుతుంటే… ఫ్యాన్స్ లోంచి ఒకరు దూసుకు రావడం.. కాళ్ల మీద పడడం.. హీరో వారించడం.. ఎక్సెట్రా.. ఎక్సెట్రా.. ఇవన్నీ కామనే. దానిపై కూడా చాలా జోకులు పేలుతుంటాయి. ట్రోల్స్ జరుగుతుంటాయి. `ఇదంతా కావాలని చేసిన ఎరేంజ్మెంట్` అని నవ్వుకుంటుంటారు. సరిగ్గా.. ఇలాంటిదే.. ఆచార్య వేడుకలోనూ జరిగింది. రామ్ చరణ్ మైకు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు వేదికపైకి ఓ అభిమాని పరుగు పరుగున వచ్చాడు. చరణ్ కాళ్లకు దండం పెట్టి, సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. ఆ అభిమానిని ఆపడానికి చరణ్ వ్యక్తిగత సిబ్బంది పరుగులు పెట్టి, పక్కకు లాక్కెళ్లిపోతుంటే చరణ్ వారించాడు. అభిమానికి సెల్ఫీ తీసుకునే అవకాశం ఇచ్చాడు. అయితే ఇక్కడే చరణ్ “ఓయ్ ఎవరమ్మా నువ్వు.. ఎవరు పంపారు.. ఎరేంజ్మెంటా“ అని అడగడం.. నవ్వులు తెప్పించింది. వేదికపై ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా.. దాన్ని వేరే కోణంలో చూసేవాళ్లు ఎలాగూ ఉంటారు కాబట్టి.. ఆ సెటైర్ని తనపై తానే వేసుకున్నాడు చరణ్. ఓ రకంగా.. చరణ్ హాస్య చతురతకు ఇదో మచ్చుతునకగా మిగిలిపోయింది. ఇప్పుడు మీమ్స్ చేసేవాళ్లకు కూడా చరణ్ అవకాశం ఇవ్వనట్టే.