ట్విట్టర్లో రామ్‌గోపాల్ వర్మ వ్యవహారాన్ని వీక్షిస్తున్న పలువురు ప్రేక్షకులకు చిరాకు పడుతున్నారు. మరీ ఇంత అతి చేస్తున్నాడు ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్మ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్ గురువారం విడుదలైంది. ట్రైలర్లో నందమూరి కుటుంబ సభ్యుల్ని విలన్లుగా వర్మ చూపించారు. ట్రైలర్ చుట్టూ వివాదం నెలకొనడంతో ట్రైలర్లో ఏముందో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి కనబరచడంతో వ్యూస్ చెప్పుకోదగ్గ సంఖ్యలో వచ్చాయి. అంత మాత్రానా వర్మ తీసింది ఓ కళాఖండం అనుకోవాలా? వర్మ మాత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాన్ని కళాఖండంగా భావిస్తున్నట్టున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్ చూశాడు. పీఎం నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ట్రైలర్ చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ట్రైలర్ చూశారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆయన తనయుడు కేటీఆర్ ట్రైలర్ చూపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ట్రైలర్ చూస్తూ `ఈ ట్రైలర్ లో వీడిని ఎక్కడో చూసినట్టుంది` అని కామెంట్ చేసినట్టు ట్వీట్లు పెట్టాడు వర్మ. చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ అందరూ `లక్ష్మీస్ ఎన్టీఆర్` చూసినట్టు ట్వీట్లు చేశాడు. ఇవి చూసి పలువురు నవ్వుకుంటున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారుతున్నాడు ఏంటని, ఈ చీప్ ట్రిక్స్ ఏంటని కొందరు చిరాకు పడుతున్నారు. తెలుగుదేశం వ్యతిరేక పార్టీల మద్దతుదారులు `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్‌పై ఆసక్తి కనబరుస్తుంటే.. తటస్థ ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.