ఆంధ్రప్రదేశ్ లో భాజపా అనుసరించాల్సిన వ్యూహంపై గుంటూరులో ఆ పార్టీ కీలకనేతలు భేటీ అయ్యారు. జాతీయ నాయకులు మురళీధర్ రావు, రామ్ మాధవ్ ఈ కార్యక్రమానికి వచ్చారు. రాష్ట్రంలో భాజపాను వీలైనంత త్వరగా బలపరచాలనేదే ఈ సమావేశ ప్రధాన అజెండా అని చెప్పొచ్చు! సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకుల్ని ఆకర్షించాలనేది ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలుగా తెలుస్తోంది. ఇప్పుటికే నలుగురు ఎంపీలు వచ్చారు కాబట్టి, టీడీపీ నుంచి మరింతమంది భాజపా వైపునకు చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ, ఈ సందర్భాన్ని ఏపీ భాజపా సద్వినియోగం చేసుకోవాలని జాతీయ నేతలు సూచించినట్టుగా సమాచారం. జనసేన పార్టీ నుంచి కూడా నాయకుల్ని చేర్చుకునేందుకు సానుకూల సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం! అంతేకాదు, టీడీపీ జనసేన పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపే బాధ్యతల్ని కూడా కొంతమంది నేతలకు ప్రత్యేకంగా అప్పగించినట్టు తెలుస్తోంది.
ఆంధ్రాలో భాజపా-వైకాపా ఒక్కటే అనే అభిప్రాయం ప్రజల్లో కొంత ఏర్పడిందనీ, గడచిన ఎన్నికల్లో భాజపాకి రాష్ట్రంలో అదే కాస్త ఇబ్బంది కలిగించిన అంశంగా మారిందని జాతీయ నేతలు విశ్లేషించారు. జగన్ సర్కారు నెలరోజుల పాలనపై కూడా భాజపా నేతలు చర్చించారు. ఈ సందర్భంలోనే వైకాపాతో వ్యవహరించే తీరుపై మరింత స్పష్టత ఉండాలనీ, ఆ పార్టీకి సానుకూలంగా ఉన్నట్టుగా రాష్ట్ర పార్టీ కార్యాచరణ ఉండకూడదని నేతలు అభిప్రాయపడ్డారు. వైకాపాతో ఎలాంటి స్నేహమూ లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే విధంగా త్వరలోనే కార్యాచరణ రూపొందించబోతున్నట్టు సమాచారం! అమ్మ ఒడి, ప్రజావేదిక కూల్చేయడం, కరకట్ట నిర్మాణాలపై జగన్ సర్కారు బాగా దూకుడుగా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.
వైకాపాతో ఎలాంటి స్నేహం ఉండదని నిరూపించుకోవడం భాజపాకి కత్తిమీద సామే అవుతుంది. ఎందుకంటే, కేంద్రంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరాలున్నాయి. ప్రత్యేక హోదా మొదలుకొని రాష్ట్రానికి రావాల్సినవన్నీ సామరస్యపూర్వకంగానే సాధించుకుంటామంటున్నారు. కాబట్టి, కేంద్రంతో ఆయన డీల్ చేసే విధానం సాఫ్ట్ గానే ఉంటుంది. అలాంటప్పుడు, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంపై భాజపా నేతలు దూకుడుగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వ విధానాలను జగన్ సర్కారు మెచ్చుకుంటూ పోతుంటే, రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ భాజపా నేతలు విమర్శలు చెయ్యగలరా..? గతంలో టీడీపీతో పొత్తులో ఉండగా… ఆ పార్టీ అదుపాజ్ఞల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా జగన్ సర్కారు విషయంలో కొన్ని అంశాల్లో కొంత సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ, ఆ పరిధి దాటితేనే రాష్ట్రంలో భాజపా సొంతంగా బలం పుంజుకోవడం మొదలౌతుంది. ఇకపై భాజపా కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.