బీజేపీలోకి రామ్ మాధవ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయనను కిషన్ రెడ్డితో కలిసి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంచార్జిగా నియమించారు. బీజేపీ పెద్దలు ఆయనను పక్కన పెట్టడంతో ఐదేళ్ల కిందట మళ్లీ ఆరెస్సెస్ కు వెళ్లిపోాయరు. ఇప్పుడు మళ్లీ ఆయనకు్ బీజేపీలో కీలక బాధ్యతలు ఇచ్చారు.
2014 తర్వాత ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన రామ్ మాధవ్ కు మంచి ప్రాధాన్యం లభించింది. ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. ఆయనకు ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్ బాధ్యతలు ఇచ్చారు. రామ్ మాధవ్ తాను బాధ్యతలు తీసుకున్న అన్ని చోట్ల బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడేలా చేశారు. చివరికి బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉండే పీడీపీతో కలిసి బీజేపీ కశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. ఆయన వ్యూహాలను చూసి బీజేపీ అధ్యక్షుడ్ని చేస్తారని అనుకున్నారు.
కారణం ఏదైనా తర్వాత ఆయన ఫేడవుట్ అయిపోయారు. అధ్యక్ష పదవి కాదు కదా.. ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఉంచలేదు. దాంతో ఆరెస్సెస్ లో మళ్లీ కీలక బాధ్యతలు తీసుకుని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్న సమయం కావడం.. ఆయనకు కశ్మీర్ లో రాజకీయాలు చేసిన అనుభవం ఉండటంతో బీజేపీ పెద్దలు మళ్లీ పిలిపించారు. ఆయనకు మళ్లీ బీజేపీలో ప్రాధాన్యం ఇస్తారా లేదా అన్నది కశ్మీర్ ఫలితాలను బట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.