ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఎన్డీయే, దాని మిత్రపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ చేసిన వ్యాఖ్య రొటీన్‌దే అయినా.. ఆయన రాజకీయ చతురతను వెల్లడిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కోవింద్, బీహార్ గవర్నర్‌గా ఉన్న సమయంలో అనూహ్యంగా రాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వం వరించింది. బీహార్ విషయాన్నే తీసుకుంటే అక్కడ రాజ్యాంగం ఎన్నిసార్లు అపహాస్యం పాలైందో లెక్కలేదు. గణాంకాలున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి. ఇందిరా గాంధీ మొదలు.. మన్మోహన్ సింగ్ హయాం వరకూ ఇద్దరు లేదా ముగ్గురు ప్రధానులను మినహాయిస్తే.. ఎన్నోసార్లు రాజ్యాంగం నగుబాటుకు గురైంది. ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశం అందుకు తాజా ఉదాహరణ. తలుపులేసేసి, చట్టం చేయమని ఏ రాజ్యాంగం చెప్పింది. ఎన్నికల్లో మందబలంతో నెగ్గాలని చూసే అభ్యర్థులు అదే బలాన్ని ఆనాడు పార్లమెంటులో చూపారు.
ప్రభుత్వానికి ఇరుకున పడే సందర్భం ఎదురైనప్పుడు చట్ట సవరణలకు పూనుకుంటూ రాజ్యాంగాన్ని గేలిచేశారు.
పార్టీ ఫిరాయింపు చట్టం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నిసార్లు అపహాస్యానికి గురైందో కోవింద్ ఒక్కసారి గుర్తుచేసుకుంటే మేలు. ప్రజాభిప్రాయమే పునాదిగా మనుగడ సాగిస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి పదవులకు ఎంపికలో ప్రజలకు ఏమాత్రం ప్రమేయం లేదు.
తనకు రాజ్యాంగాన్ని మించిన మత గ్రంథం లేదని కూడా కోవింద్ అన్నారు. ఇప్పుడు తానే పార్టీ వాడినీ కానని అనడం కూడా ఆయన చతురతను వెల్లడిస్తోంది. ఈసారి రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎంపిక అంశంలో సంప్రదాయాన్ని తోసి రాజన్నారు. ప్రధాని ఉత్తరాది వారైతే.. రాష్ట్రపతి దక్షిణాది వ్యక్తిని ఎన్నుకోవడం చాలా సందర్భాలలో చోటుచేసుకుంది. కనీసం ఉపరాష్ట్రపతి పదవైనా దక్షిణాది రాష్ట్రాలకు కేటాయిస్తారో లేదో చూడాలి. ప్రస్తుత లెక్కలు కోవిందే భావి రాష్ట్రపతని స్పష్టంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల పర్యటనలో రామ్‌నాధ్ తాను పలికిన చిలకపలుకులను గుర్తుచేసుకుని పదవీ బాధ్యతలు నిర్వహిస్తే అంతకుమించిన భాగ్యముండదు. రాజ్యాంగానికి పవిత్రతను కల్పించినవారవుతారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి