హైదరాబాద్: పండగ చేస్కో తర్వాత రామ్, శివం చిత్రంతో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ సరసన రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. రామోజీ ఫిలిమ్ సిటీలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం హై ఓల్టేజ్ లవ్ స్టోరి అని నిర్మాత చెప్పారు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ అని, రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారని తెలిపారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూల్ లో పాటలు మినహా పూర్తవుతుందని, వచ్చే నెల పాటల చిత్రీకరణ మొదలుపెడతామని వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు. .బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, కెమెరా రసూల్ ఎల్లోర్, యాక్షన్ పీటర్ హెయిన్స్.