ధరణితో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, భూముల విషయంలో ఉన్నతాధికారుల తీరు వివాదాస్పదంగా ఉందన్న ఆరోపణలు తెలంగాణలో చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. భూములను నిషేధిత జాబితాలో పెట్టడం, కొన్ని భూములు టైటిల్స్ తప్పుగా చూపటం వంటి ఎన్నో అక్రమాలు వినిపిస్తూనే ఉండగా… ఇంత వరకు చిన్న చిన్న అధికారులే దొరికారు. కానీ, తొలిసారిగా ఓ జాయింట్ కలెక్టర్ ఏసీబీకి చిక్కటం సంచలనంగా మారింది.
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. గుర్రంగూడలోని ఓ భూమిని ధరణి వెబ్ సైట్ లో నిషేధిత జాబితాలో పెట్టారు. దాన్ని తీసేయాలని జక్కిడి ముత్యంరెడ్డికి చెందిన భూమిని అధికారులను ఆశ్రయించగా… సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ భూపాల్ రెడ్డి లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు.
మొదట సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆరా తీయగా జేసీ భూపాల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. దీంతో జేసీ చెప్పిన విధంగా పెద్ద అంబర్ పేట్ ఓ.ఆర్.ఆర్ వద్దకు వెళ్లి ట్రాప్ చేసి ఏసీబీ పట్టుకుంది.
ప్రస్తుతం జేసీ ఇండ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇంట్లో కొన్ని భూ పట్టాలు, డాక్యుమెంట్లతో పాటు 16లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.