ప్రతి శుక్రవారం ఏదొ ఒక బొమ్మ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ మాటకు వస్తే ఒకటన్నమాటేమిటి? రెండు మూడు సినిమాలు కూడా వస్తుంటాయి. కొన్ని బొమ్మలు చూస్తే హమ్మ..అనిపిస్తుంది. మరి కొన్ని బొమ్మలు చూస్తే దిమ్మ దిరిగిపోతుంది. ఇంకొన్ని బొమ్మలు చూస్తే, ఇలా కాకుండా అలా చేసి వుంటే అని కూడా అనిపిస్తుంది. సాధారణంగా సమీక్షల్లో ఇలాంటివి అన్నీ ముచ్చటించుకోలేం. సమీక్షకు వున్న పరిథులు అలాంటివి. ఆ పరిథులు దాటి సినిమాను చూస్తే…అదే బొమ్మ బొరుసు..
విశ్వ విఖ్యాత శంకరాభరణం సినిమా మీద సుప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ, ఆ రోజుల్లో తన మార్కిస్టు సిద్దాంత ధృక్కోణంలో ఓ వ్యాసం రాసారు. అది అప్పట్లో ఓ సంచలనం. అదే విధంగా ఇప్పుడు రంగస్థలం సినిమాలోని మరో కోణాన్ని చూసే ప్రయత్నమే ఇది తప్ప, ఆ సినిమాను తక్కువ చేయడమో , ఎక్కువ చేయడమో మాత్రం కాదు.
రంగస్థలం సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ రంగస్థలం 1985 అన్నది. కానీ ఆ తరువాత ఆ నెంబర్ తీసేసారు. దానికి వాళ్లు చెప్పుకున్న కారణాలు వేరే వున్నాయి. అవి ఇక్కడ అప్రస్తుతం. అయితే అసలు సుకుమార్ ఈ సినిమాను పీరియాడికల్ సినిమాగా ఎందుకు తీసారు? కథగా చూసుకుంటే ఓ గ్రామంలో జరిగిన కథ. కొంత పీడితులు బాధలు, మరి కొంత ప్రతీకారం. ప్రతీకారం కూడా పెద్దగా ఏమీ లేదు. ఊరందరూ కలిసి భూస్వామిని తరిమి కొడితే, ఎక్కడో పొలాల్లో దాక్కున్న వాడిని వెదికి చంపాడు. చంపిన తరువాత కానీ తెలియలేదు. నిర్దోషిని (తన అన్నను హత్య చేసాడనుకుని తను చంపేసాడు. అంటే ఆ విధంగా భూస్వామి నిర్దోషి నే గా) చంపేసానని. ఆ తరువాత మళ్లీ దోషి ఎవరో తెలిసాక, ఒక సారి అతగాడికి నువ్వు దోషివి అని చెప్పి, చంపేసాడు. చాలా మంది ఈ కథను ఇలా పీరియాడికల్ డ్రామాగా ఎందుకు తీసాడు సుకుమార్? అని ప్రశ్నించి, వాళ్లకు వాళ్లే జవాబులు చెప్పుకున్నారు.
సినిమాకు ఓ లుక్ తీసుకురావడం కోసం అని, అలనాటి పల్లెల అమాయకత్వపు రూపం కళ్ల ముందుకు తేవాలని, సుకుమార్ ఇలా చేసాడని చాలా మంది భావించారు. కానీ అదయితే కాదని క్లియర్ గా తెలిసిపోతోంది. ఎందుకంటే సుకుమార్ అన్యాపదేశంగా ఈ కథలో పల్లెల్లోని వర్థ వ్యవస్థను చర్చించాడు.
ఫణీంధ్ర భూపతి అని ప్రెసిడెంట్ కు పేరు పెట్టడం ద్వారా అతగాడు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాడు అని చెప్పకనే చెప్పాడు. అలాగే దక్షణామూర్తి అని ఎమ్మెల్యేకు పేరు పెట్టడం ద్వారా, క్లయిమాక్స్ లో ‘ఎవరు పడితే వాళ్లు ఇంటిలోకి వచ్చేస్తున్నారు, మైల పడిపోతోంది ఇల్లు’ అని ఓ పెద్దావిడతో చెప్పించడం ద్వారా బ్రాహ్మణ కులానికి చెందిన వాడు అని చెప్పకనే చెప్పేసాడు సుకుమార్. ఇక హీరో తదితరుల ఇంటి పేర్లు ప్రస్తావించి, శెట్టి బలిజ, కాపు, తదితర వెనుక బడిన సామాజిక వర్గాల ప్రస్తావన చేసాడు.
క్షత్రియులు, బ్రాహ్మణులు అనే అగ్రవర్ణాల కారణంగా కొన్ని వెనుకబడిన కులాలు బాధలకు గురయ్యాయి అన్నది అన్యాపదేశంగా దర్శకుడు చెప్పాడు. అయితే అందుకు 80వ దశకాన్ని ఎందుకు నేపథ్యంగా ఎంచుకున్నాడు? ఎందుకంటే ఇప్పుడు గోదావరి లేదా కోస్తా జిల్లాల్లో పరిస్థితి వేరుగా వుంది కనుక. ఇప్పుడు ఇదే కథ ఇలాగే తీయాలంటే, ఫణీంద్ర భూపతి లేదా దక్షిణామూర్తిలు పాలితులుగా కనిపించరు. చిట్జిబాబులు, కుమార్ బాబులు బాధితులుగా కనిపించరు. ఎందుకంటే ఇప్పుడు దక్షిణామూర్తులు ఎక్కడా అధికారం వెలగ బెట్టడం లేదు. పైగా ఈ ‘గ్లాసులు కడగడం’’ అన్నది ఇప్పుడు కోస్తా జిల్లాల్లో, లేదా గోదావరి జిల్లాల్లో ఎక్కడన్నా వుందీ అంటే రంగస్థలంలో బాధితులు ఎవరో , ఇప్పుడు వారే పాలితులుగా చేస్తున్న పని అది.
ఎందుకంటే గోదావరి లేదా కోస్తా జిల్లాల్లొ ఇప్పుడు వెనుకబడిన సామాజిక వర్గానికి, షెడ్యూలు సామాజిక వర్గాలకు మధ్య రాజకీయ వైరం వుంది. అది శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖ, ఈస్ట్, వెస్ట్, జిల్లాల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికీ రంగస్థలం నాటి వర్ణ వ్యవస్థే వుంది. కానీ నాటి బాధిత కులాలు ఇప్పుడు పాలిత కులాలు గా మారాయి. వాటి స్థానంలో షెడ్యూలు కులాలు బాధత కులాలుగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అందుకోసం సుకుమార్ 80వ దశకానికి వెళ్తాడు. అలా కాకుండా ఇదే వర్ణవ్యవస్థను ఇప్పుడు ఇలాగే వర్తమానంలో తీస్తే, జనం నవ్వుతారు. ఇంకా ఎక్కడ, చిట్టిబాబు కులానికి చెందిన వారు బాధితులుగా వున్నారని నిలదీస్తారు.
సుకుమార్ ప్రదర్శించిన ఇంకో తెలివైన విషయం, క్షత్రియు, బ్రాహ్మణ, వెనుకబడిన వారిని ప్రస్తావించి, మిగిలిన అట్టడుకు కులాల గురించి కొంచెం కూడా ప్రస్తావించకపోవడం. చిత్రమేమిటంటే, బ్రాహ్మణుడైన దక్షిణామూర్తి తన పిల్లను ప్రేమించాడని కుమార్ బాబుపై ద్వేషం పెంచుకుంటాడు. కానీ రామలక్ష్మి లాంటి వెనుకబడిన కులానికి చెందిన అమ్మాయి, ముందుగానే అదే కులానికి చెందిన చిట్టిబాబును ‘ఇదిగో..మీరేవిట్లు’ అని అడిగేస్తుంది. అంటే కులం పట్టింపు అగ్రవర్ణంలో అయినా, బడుగు వర్ణంలో అయినా కామన్ అని సుకుమార్ చెప్పకనే చెప్పేసాడు.
*
ఇక రంగస్థలంలో కొన్ని ‘సిత్రాలు’ కనిపిస్తాయి. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సర్పంచ్ పదవులకు జనాల నుంచి ఎన్నుకునే మార్పు వచ్చింది. అంతకు ముందు పంచాయతీ మెంబర్లు ఎన్నుకునేవారు. వార్డు మెంబర్లుగా ఎవరికి వారు పోటీ చేసుకోవాలి. గెలిచిన వారు అంతా కలిసి ఒకరిని సర్పంచ్ చేసుకోవాలి. 1980 నాటి లెక్క అంటే అదీ. లేదూ డైరక్ట్ ఎలక్షన్ వచ్చిన తరువాత అనుకుంటే, వార్డు మెంబర్లు వున్నా లేకున్నా ఫరవాలేదు. కానీ సినిమాలో రెండూ కలిపి కొట్టడం పక్కా లాజిక్ మిస్సింగ్ నే.
ప్రెసిడింట్ కు డబ్బు దాహం అనుకోవాలి. ఎందుకంటే అతగాడు ఏ అమ్మాయినీ చెరపట్టినట్లు చూపించలేదు. ఎవరినీ బాధపెట్టినట్లు చూపించలేదు. కేవలం ప్రభుత్వ పథకాలు తాను దొచుకోవడం, ప్రజలను మోసం చేసి సొసైటీకి ఎక్కువ డబ్బులు కట్టేలా చేయడం. మరి ఇంత డబ్బు దాహం వున్న వ్యక్తికి ఓ భార్య, ఓ బిడ్డ ఎవరూ వున్నట్లు చూపించలేదు. ఏక్ నిరంజన్. వెలుగు లేని భారీ ఇల్లు. అదేం సిత్రమో? ఇక ఎమ్మెల్యేది మరీ సిత్రం. అతగాడు ఓ సర్పంచ్ కు భయపడతాడు. ఇది ఎక్కడా జరగనిది. ఎమ్మెల్యే తలుచుకుంటే సర్పంచ్ ను ముప్పుతిప్పలు పెట్టగలడు. అంతెందుకు. కుమార్ బాబు నామినేషన్ వేయగానే సోసైటీకి ఆడిటింగ్ కమిటీ ఎలా వచ్చింది? ఎమ్మెల్యే కావాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేయవచ్చుగా? అదీ కాక ప్రెసిడెంట్ మూడు మర్డర్లు చేసాడు. ఎమ్మెల్యే వాటిని ఎంక్వయిరీ చేయించలేడా? అలా ప్రెసిడెంట్ ను బిగించలేడా?
అది సరే, రంగమ్మత్త మొగుడుని చంపేసారు. ఆ సంగతి రంగమ్మత్తకు మాత్రం తెలుసు. ఊరి జనాలకు తెలియదు? ఆమెకు మాత్రం ఎలా తెలుసు? వస్తున్నవాడిని దారి కాచి కదా చంపేసారు. ఊళ్లో వాళ్లకు తెలియకుండా రంగమ్మత్తకు మాత్రం తెలియడం, ఆమె దానిని దాచడం, భలే లాజిక్ చిత్రం.
ఇంకా గమ్మత్తు ఏమిటంటే, చిట్టిబాబు ఊరి జనాలు సొసైటీలో తీసుకున్నది మూడు వేలు, నాలుగు వేలు లాంటి చిన్న చిన్న మొత్తాలు. రెక్కాడితే కానీ డొక్కాడని, పిల్లలకు చదువు, పెళ్లిళ్లు చేయలేని వ్యవహారం. కానీ వీళ్లంతా జిగేల్ రాణి లాంటి ఫిగర్ ను ఊళ్లోకి తేవడం, ఆమెకు ఆస్తి రాసిస్తా, పొలం రాసిస్తా, లక్ష ఇస్తా, ఇలాంటి బీరాలు పలకడం. ఏమిటో ఇదంతా…
సాదా సీదా సినిమాలను నిలదీయలేం. సాదా సీదా దర్శకులను తప్పు పట్టలేం. ఎందుకంటే ఆ సినిమాలే అంతా, ఆ డైరక్టర్ల మేధావి తనమే అంతంత మాత్రం. కానీ సుకుమార్ వేరు. ఆయన పరిజ్ఞానం వేరు. అందుకే ఇలా ఓసారి గుర్తుచేయడం అంతే.