మహేష్ బాబు – అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా సాగిపోతున్నాయి. అనిల్ రావిపూడి.. ప్రస్తుతం స్క్రిప్టుని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేలో ఈ సినిమా పట్టాలెక్కేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈలోగా మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల కోసం ముమ్మర కసరత్తులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. సాయి పల్లవి, రష్మిక మందన్నా.. పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరికీ యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న కథానాయికల్లో వీళ్లూ ఉన్నారు. మహేష్ తో ఇప్పటి వరకూ నటించలేదు. కాబట్టి వీళ్ల మధ్య కెమిస్ట్రీ కొత్తగా కనిపించడం ఖాయం. అందుకే… వీరిద్దరికే అనిల్ రావిపూడి ఓటేసినట్టు తెలుస్తోంది. అయితే మే నుంచి వీళ్ల డేట్లు అందుబాటులో ఉంటాయా? లేదా? అనేది అనుమానంగా మారింది. డేట్లు కుదిరితే ఓకే. లేదంటే మరో ఆప్షన్ అప్పుడు వెదుక్కోవచ్చు. మహేష్ సినిమా అంటే ఎవరు వదులుకుంటారు? రష్మిక. సాయి పల్లవి చేతిలో ఉన్న సినిమాల్ని పక్కన పెట్టడానికైనా సిద్ధమవ్వడం ఖాయం.