ఈరోజుల్లో హీరోల రెమ్యునరేషన్ అనేది పెద్ద మేటరే కాకుండా పోయింది. రూ.10, 20, 30.. ఇలా కోట్లకు కోట్లు తీసుకొంటున్నారు హీరోలు. నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. సినిమా హిట్టయితే రెమ్యునరేషన్ పెంచడం సాధారణమే. కానీ ఫ్లాప్ అయినా కూడా హీరోలు తగ్గడం లేదు. సినిమా సినిమాకీ డోసు పెంచుతున్నారు. ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యే హీరోల్లో రవితేజ ఒకడు. తన తాజా చిత్రం ‘రావణాసుర’ ఫ్లాప్. కానీ.. చేతినిండా బోలెడు సినిమాలు. అందుకే పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.
కలర్ ఫొటో ఫేమ్ సందిప్ రాజ్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి గానూ రూ.25 కోట్ల పారితోషికం అందుకొంటున్నాడు మాస్ మహారాజా. ‘ధమాకా’ కూడా ఇదే బ్యానర్లో వచ్చి మంచి లాభాల్ని అందుకొంది. అందుకే.. రవితేజ అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ఇదో మల్టీస్టారర్ కథ. ఇందులో ఓ యువ హీరో కూడా నటిస్తున్నాడు. శర్వానంద్‌కి ఆ ఛాన్స్ దక్కిందన్నది టాక్. కాకపోతే ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.