డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తోంది. యూపీఐ విధానం వచ్చాక డిజిటల్ చెల్లింపులు చాలా పెరిగిపోయాయి. చిరు వ్యాపారి నుండి అందరూ ఇప్పుడు యూపీఐ పేమెంట్ విధానంలోకి వచ్చిన వారే.
చెల్లింపుల కోసం యూపీఐ తెచ్చినట్లే… ఇప్పుడు అప్పులు పొందేందుకు యూఎల్ఐ వ్యవస్థను తీసుకొస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పు అనగానే బ్యాంకులు సవాలక్ష ప్రశ్నలు, పేపర్ డాక్యుమెంట్లు అడుగుతుంటాయి. కానీ, ఇక నుండి అప్పులు సులభంగా పొందేలా తీసుకరాబోతున్న వ్యవస్థే… యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేస్. అదే యూఎల్ఐ.
దేశంలోని అన్ని భూ రికార్డులు యూఎల్ఐతో అనుసంధానిస్తారు. అవి ఎవరి పేరుతో ఉన్నాయో, వారి వివరాలతో సహ అటాచ్ చేస్తారు. దీంతో మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు డేటా అంతా యూఎల్ఐతో ఉంటుంది. అప్పుడు ఓ వ్యక్తి లోన్ కావాలి అనుకుంటే… దాని ఆధారంగా లోన్ ప్రాసెస్ ను బ్యాంకులు పూర్తి చేస్తాయి. ఫిజికల్ డాక్యుమెంట్లు పెద్దగా అవసరం ఉండదు.
వీటి ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ లోన్ పొందాలనుకునే వారికి సులభంగా తీసుకునే అవకాశం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. త్వరలోనే ఈ విధానం పైలెట్ ప్రాజెక్టు ద్వారా పరీక్షించి, ఆచరణలోకి తీసుకొస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. యూపీఐ ఎంత సక్సెస్ అయ్యిందో యూఎల్ఐ కూడా అంతే సక్సెస్ అవుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.