ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓటములు. పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానం. ఇలాంటి దశలో బెంగళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుందని ఎవరైనా ఊహించి ఉంటారా? కానీ బెంగళూరు అద్భుతం చేసింది. ప్లే ఆఫ్‌లో అడుగు పెట్టింది. ఏడు ఓటముల తరవాత వరుసగా ఆరు విజయాలతో… ప్లే ఆఫ్ రేసులోకి వచ్చేసింది. నిజంగా బెంగళూరు చేసిన రేట్ ఫీట్ ఇది. చెన్నైతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు అద్భుతంగా ఆడి.. గెలిచింది. ప్లే ఆఫ్ లోకి సగర్వంగా అడుగు పెట్టింది.
బెంగళూరులోని చిన స్వామి మైదానంలో, సొంత ప్రేక్షకుల మధ్య డూప్లెసిస్ సేన చెలరేగి ఆడింది. 18 పరుగుల తేడాతో గెలిస్తే, ప్లే ఆఫ్ కి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో 27 పరుగుల తేడాతో చెన్నైని ఓడించి, ప్లే ఆఫ్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. ప్లే ఆఫ్ చేరాలంటే బెంగళూరు చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించాలి. ఇలాంటి సందర్భంలోనే బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించి, చెన్నైని మట్టికరిపించారు. చివరి ఓవర్లో చెన్నై ప్లే ఆఫ్ చేరాలంటే 17 పరుగులు చేయాల్సిన సందర్భంలో దయాళ్ చివరి ఓవర్ తొలి బంతికి సిక్సర్ ఇచ్చాడు. 5 బంతులు 11 పరుగులుగా సమీకరణం మారిపోయింది. ఆ దశలో బెంగళూరు ప్లే ఆఫ్ ఆశల్ని వదులుకొంది. అయితే దయాళ్ అనూహ్యంగా పుంజుకొన్నాడు. తరువాతి బంతికి ధోనిని ఔట్ చేశాడు. మిగిలిన 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దాంతో చెన్నై ఇంటిదారి పట్టాల్సివచ్చింది. 15 సీజన్లలో చెన్నై ప్లే ఆఫ్ చేరకపోవడం ఇది కేవలం 3వసారి మాత్రమే. కొలకొత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇదివరకే ప్లే ఆఫ్‌కి చేరుకొన్న సంగతి తెలిసిందే.