కథలు ఊహల్లోంచి కాదు. జీవితాల్లోంచి పుట్టుకురావాలి. అలాంటి కథలకే జీవం ఉంటుంది. ఈవారం (ఆగస్టు 18) కథల్లో చాలా వరకూ అలాంటి జీవం ఉన్న కథలే కనిపించాయి. ఓ రచయిత అయితే తన జీవితంలో ఎదురైన స్వీయ సంఘటనని కథగా మలిచారు. ఆ కథకు రూ.50 వేల బహుమతి కూడా వచ్చింది. మరి ఆ కథలేంటి? వాటిలో ఉన్న సందేశం ఏమిటో తెలుసుకోవాలంటే ఈవారం ‘కథాకమామిషు’పై ఓ లుక్ వేయాల్సిందే!
కథ: అమ్మ చిరునామా
రచన: డా.ఎం.కోటేశ్వరరావు
పత్రిక: నమస్తే తెలంగాణ
దిన పత్రికలు కథల పోటీని నిర్వహించడం ప్రధమ కథకు రూ.50 వేల బహుమతి అందివ్వడం ఈరోజుల్లో గొప్ప విషయమే. ‘నమస్తే తెలంగాణ’ ఈ ఫీట్ ని కొన్నేళ్లుగా చేస్తోంది. ఈవారం ప్రధమ బహుమతి పొందిన కథ `అమ్మ చిరునామా`ని ప్రచురించింది. పేరులోనే తెలిసిపోతోంది… ఇదో అమ్మ కథ అని. అమ్మలంతా గొప్పవాళ్లే. ఈ అమ్మ మాత్రం మరింత గొప్పగా కనిపిస్తుంది ఈ కథలో. రచయిత ఎం. కోటేశ్వరరావు జీవితంలో ఎదురైన సంఘటన ఇది. దానికి అక్షర రూపం ఇచ్చారు. కథ చాలా సింపుల్ గా మొదలెట్టారు. కథ నడుస్తున్న కొద్దీ ఉద్వేగం పెరుగుతుంది. పేరుకే పేద, కానీ ప్రేమ పంచడంలో ఎవరికీ అందనంత గొప్ప ధనవంతురాలైన అమ్మ కథ ఇది. ముగింపు హృద్యంగా ఉంది. అమ్మలెంత గొప్పవారో కదా అనిపిస్తుంది. వాళ్లకు మనసులోనే దండం పెట్టాలనిపిస్తుంది. తప్పక చదవాల్సిన కథ.
కథ: నాకొద్దీ మంచితనం
రచన: శ్రీపతి లలిత
పత్రిక: ఈనాడు
మంచితనం కూడా ఓరకమైన బలహీనతే. ఆ ముద్ర ఒక్కసారి పడిపోతే దాన్ని కాపాడుకోవడానికి నానా త్యాగాలు చేయాల్సివస్తుంది. ఈ కథలో వైదేహీలా. మంచి కూతురుగా, మంచి విద్యార్థిగా, మంచి ఉద్యోగిగా, ఆ తరవాత మంచి భార్యగా, మంచి కోడలుగా.. ఇలా ఎక్కడకు వెళ్లినా ‘మంచి.. మంచి’ అనిపించుకోవాలని తపించిపోయి, ఆ మంచితనం వల్లే నానా ఇబ్బంది పడుతుంటుంది వైదేహీ. చివరికి ‘నా కొద్దీ మంచితనం’ అంటూ ఓ దండం పెడుతుంది. ఇంత మార్పు వైదేహీలో ఎందుకు వచ్చింది? ఆ తరవాత ఏమైంది? అనేదే ఈ కథ. మంచి పాయింట్ తో కథ రాశారు రచయిత్రి. అయితే ముగింపు త్వరగా వచ్చేసిందనిపించింది.
కథ: సీతాకోక చిలుక
రచన: దినేష్
పత్రిక: సాక్షి
ఎదిగిన కూతురు ఇంట్లో ఉంటే… తల్లిదండ్రులకు, ముఖ్యంగా మధ్యతరగతి తల్లిదండ్రులకు గుండెలపై భారంగానే తోస్తుంది. ఎలాగోలా పెళ్లి చేసేయాలన్న ఆలోచన పరుగులు పెట్టిస్తుంటుంది. అయితే అమ్మాయిలకంటూ కొన్ని కలలు, కోరికలు, ఇష్టాలూ ఉంటాయి. ఆ వయసులో సీతాకోక చిలుకల్లా స్వేచ్ఛగా ఎగరాలనుకొంటారు. వాటినీ గౌరవిస్తే ఎంత బాగుంటుందో చెప్పిన కథ ఇది. వ్యవసాయ దారుల కథలన్నీ కష్టాలూ, కన్నీళ్లతో ముడిపడి ఉంటాయి. అయితే ఇందులో ఓ రైతు లాభాల్ని చవిచూశాడు. ఆ ఉదంతం (ఇది కథైనా సరే) మనసుకు కాస్త స్వాంతన కలిగిస్తుంది. ఆ తండ్రి తీసుకొన్న నిర్ణయం కూడా ఆదర్శవంతమైనదే. కథలో సీతాకోక చిలుకని మెటాఫర్గా వాడడం బాగుంది.
కథ: బతుకు విపంచి
రచన: ఉమా మహేష్ ఆచళ్ల
పత్రిక: ఆంధ్రజ్యోతి
కళల గురించి, కళాకారుల వ్యధల గురించి కథలు చదువుతుంటే మనస్సు చివుక్కుమంటుంది. ఈరోజుల్లో శాస్త్రీయ సంగీతానికీ, ఆ సంగీతాన్ని నమ్ముకొన్న వాళ్లకూ దక్కుతున్న మర్యాద చూస్తే జాలేస్తుంటుంది. ‘బతుకు విపంచి’ చదివినా అలాంటి భారమైన ఫీలింగ్. ఓ వీణని తయారు చేయడానికి ఓ కళకారుడు ఎంత తపన పడతాడో ఈ కథ ద్వారా చెప్పారు. సరస్వతీదేవినే నమ్ముకొన్న ఓ కుటుంబం.. ఆ కళని బతికిస్తూ, తాము బతకడానికి ఎంత చమటోడుస్తుందో ఈ కథ చదివితే అర్థమవుతుంది. సరస్వతీ దేవిని స్కూల్లో బెల్లు కొట్టే ఉద్యోగానికి పరిమితం చేస్తే, విద్య నేర్పలేకపోతున్నందుకు బాధ పడాలా, లేదంటే ఏదోరకంగా విద్యా వ్యవస్థలోనే ఉన్నందుకు సంతోషంగా సర్దుకుపోవాలా? అనే ప్రశ్న రచయిత ఆవేదన నుంచి పుట్టుకొచ్చిందని అర్థమవుతోంది. మరుగున పడిపోతున్న ఏ కళనైనా బతికించడానికి ఎవరో ఒకరు వస్తారు. ఏదో ఓ అద్భుతం జరుగుతుందన్న ఆశావాహ దృక్పదాన్ని బీజంగా వేసి, ఈ కథని ముగించారు. అది మరింత బాగుంది.
కథ: ఏడ్చేదెవరు?
రచన: రావుల కిరణ్మయి
పత్రిక: వెలుగు
పుట్టినప్పుడు ఏం తీసుకురాలేం. పోయేటప్పుడు ఏదీ పట్టుకుపోలేం. కానీ మధ్య జీవితంలో మాత్రం ఎంతో ఆత్రం. అన్నీ దాచేసుకోవాలి అని. అలాగని అందరూ ఇలానే ఉండరు. ఉన్నదాంతో సంతృప్తి పడి, చేతనైనంత సాయం చేసి జీవితానికి ఓ అర్థం ఇచ్చేవాళ్లూ ఉంటారు. ఆ రెండు మనస్తత్వాలకు అద్దం పట్టే కథ ఇది. తెలంగాణ యాస.. చిక్కగా చిలకరించారు ఈ కథలో. కొత్త పాయింటేం కాదు. కానీ ఆ యాస, పరిసరాల వల్ల కొత్తదనం వచ్చింది.
– అన్వర్