తెలుగులో బిగ్ బాస్ అనగానే అందరూ పెదవి విరిచారు. ఇలాంటి రియాలిటీ షోలు తెలుగు వాతావరణానికి, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికీ దూరంగా ఉంటాయి కదా?? అనే అనుమానం పీకేసింది. దానికి తోడు.. సెలబ్రెటీల లిస్టు చూసి మొహాలు తేలేశారు జనాలు. ఎన్టీఆర్ వ్యాఖ్యాత అనగానే ఆసక్తి రేగింది. కానీ.. ఇంట్రడక్షన్ ఎపిసోడ్ చూసి.. కళ్లు తేలేశారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడం అనుమానమే అనిపించింది. అయితే…. సెలబ్రెటీల హడావుడి అంతగా లేని ఈ షోని.. తన భుజ స్కంధాలపై వేసుకొని నడిపించాడు ఎన్టీఆర్. శని, ఆదివారాల్లో ఈ షో మెరిసే తారక్ ఎక్స్ప్రెషన్లు, కామెంట్లు, తన టాస్క్లూ ఈ షోని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. రెండు మూడు వారాలకే టాప్ లిస్టులోకి చేరిపోయింది బిగ్ బాస్. మధ్యలో నెం.1 యారీ కాస్త కంగారు పెట్టినా.. తారక్ ముందు ఆ షో కూడా తల వంచాల్సివచ్చింది. షోలో పాల్గొన్న సెలబ్రెటీలు వాళ్లలో వాళ్లు ఎంత కలిసిపోయారో గానీ – తారక్ మాత్రం అందరిలోనూ కలిసిపోయాడు. ఒకొక్కరినీ ప్రత్యేకంగా పరిశీలించి వాళ్లలోపాల్ని, గొప్పల్ని పూచిక పుల్లతో సహా అప్పగించాడు. ఎన్టీఆర్ యాంకరింగ్ ఈ షోకి కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. సంపూర్ణేష్ బాబులాంటి వాళ్లని కూడా `మీరు.. `అంటూ ఆప్యాయంగా పలకరించి – వాళ్లకంటూ గౌరవం ఇచ్చి – తన సభ్యత చాటుకొన్నాడు ఎన్టీఆర్. తన వాక్ చాతుర్యం, సందర్భానికి తగ్గట్టుగా జోకులు పేల్చడం, అందరినీ ఆట పట్టించడం ఇవన్నీ ఈ షోకి పాపులారిటీ పెంచడానికి దోహదం చేశాయి. బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటే బిగ్ బాస్ అనే స్థాయికి తీసుకెళ్లాడు. అందుకే… బిగ్ బాస్ విజేతగా శివ బాలాజీ ఎంపికైనా – అందరి హృదయాల్లో సిసలైన బిగ్ బాస్ గా ఎన్టీఆర్ నిలిచిపోతాడు.