అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ల క్రితం వచ్చి, ఇప్పటికి అందరూ మర్చిపోయిన ‘సలీమ్’ సినిమా ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కోర్టు కేసు గొడవల వల్ల. మోహన్‌బాబు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని వైవిఎస్ చౌదరి కోర్టు కెక్కడం, ఇన్నాళ్లకు కోర్టు తీర్పు ఇవ్వడం, నష్టపరిహారంతో పాటు మోహన్ బాబుకి జైలు శిక్ష కూడా విధించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
సలీమ్ సినిమా ఫ్లాప్ అయ్యిందన్న కారణంతో దర్శకుడిగా చౌదరికి ఇవ్వాల్సిన పారితోషికంలో కొంత మొత్తాన్ని మోహన్ బాబు ఎగ్గొట్టారు. అయితే… తనకు రావాల్సిన పారితోషికం కోసం గట్టిగా ప్రయత్నించిన చౌదరికి ఓ చెక్ ఇచ్చి చేయి దులుపుకున్నారు. తీరా ఆ చెక్ బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యింది. ఈ విషయంలో పెద్ద మనుషులు కూడా కూర్చుని వ్యవహారం సెటిల్ చేయాలని చూశారు. కానీ కుదర్లేదు. ఇక ఏమీ చేయలేని పక్షంలో మోహన్ బాబుపై కోర్టుకెక్కారు చౌదరి. ఇప్పుడు ఆ తీర్పు వచ్చేసింది. అయితే మోహన్ బాబు వెర్షన్ వేరేలా ఉంది. అసలు అది సలీమ్ కోసం ఇచ్చిన చెక్ కాదని, ఆ సినిమా తరవాత వైవిఎస్ తో మరో సినిమా చేద్దామని ఇచ్చిన చెక్ అని ఆయన చెబుతున్నారు. చేయని సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్‌ని తిరిగి తీసుకోవాలనుకున్నామని, తాము బ్యాంక్‌లో వేయొద్దని చెప్పినా… చౌదరి ఆ చెక్‌ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై వైవిఎస్ చౌదరి సన్నిహితుల్ని సంప్రదించింది తెలుగు 360. “అది ముమ్మాటికీ సలీమ్ కోసం తీసుకున్న చెక్కే. మరో సినిమా చేయాలన్న ప్రతిపాదన ఆ సమయంలో అస్సలు వాళ్ల మధ్య లేదు. పైగా సలీమ్ చిత్రీకరణ సమయంలోనే తమ మధ్య గొడవలు జరిగాయని విష్ణు ఓ సందర్భంలో చెప్పాడు. అలాంటప్పుడు సలీమ్ తీసిన వెంటనే మరో సినిమా తీయాలని ఎందుకు అనుకుంటారు? అడ్వాన్స్ ఎలా ఇస్తారు? డిసెంబరు 12న సినిమా విడుదలైతే.. 11న చెక్ ఇచ్చారు. నెలరోజుల తరవాత బ్యాంకులో వేసుకోమని చెప్పారు. సరిగ్గా నెల రోజులకు చెక్ బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ అయినప్పటికీ చౌదరి చాలా రోజులు ఓపిగ్గా ఎదురుచూశారు. మధ్యవర్తులతో ఈ సమస్య పరిష్కరించుకుందాం అనుకున్నారు. కానీ కుదర్లేదు. చివరికి కోర్టుకి వెళ్లాల్సివచ్చింది. కోర్టు కేసులో క్లియర్‌గా అది సలీమ్ కోసం ఇచ్చిన చెక్ అని ఉంది.. ఇందులో మరో వాదనకు తావు లేదు” అని క్లారిటీ ఇస్తున్నారు.