తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనం అవుతుంది! అలా కావాలనే ఆయన చేస్తారో… లేదంటే, ఆయన చేస్తున్న పనుల్ని అలా చూస్తారో తెలీదుగానీ.. చర్చ అయితే కావాల్సినంత ఉంటుంది! తాజా విషయం ఏంటంటే… స్వర్గీయ పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ వివాహ వేడుక పరిటాల స్వగ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఈ వేదికపై కలుసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కేసీఆర్ గతంలో టీడీపీలో ఉండగా పరిటాల రవితో మంచి సాన్నిహిత్యమే ఉండేది. అందుకే, కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించారు ఏపీ మంత్రి పరిటాల సునీత. అయితే, ఈ వివాహం సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపి కేసీఆర్ వెళ్లిపోయారు!
ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతపురం చేరుకున్న దగ్గర నుంచీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గురించి అడగడం మొదలుపెట్టారట! ఆయన ఎక్కడా ఎక్కడా అంటూ పలువురు నేతలను అడిగారు. తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా.. తనను పలకరించి వెళ్లిపోయిన పయ్యావులను మళ్లీ పిలిచారు కేసీఆర్. తన వాహనంలో ఎక్కించుకుని హెలీప్యాడ్ వరకూ తీసుకెళ్లారు. అక్కడ కూడా తనతో వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు వంటి నేతల్ని కూడా పక్కనబెట్టి.. పయ్యావులను మాత్రం కాస్త దూరంగా తీసుకెళ్లి, కొద్దిసేపు ఏకాంత చర్చలు జరిపారు. ఇప్పుడీ ఘటనే ఆసక్తికరంగా మారింది. అంత రహస్యంగా పయ్యావులతో కేసీఆర్ ఏం మాట్లాడి ఉంటారనేదానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అనుసరించిన వ్యూహం గురించి పయ్యావులను అడిగి ఉంటారని కొందరు అంటున్నారు. ఎందుకంటే, నల్గొండ ఉప ఎన్నికకు కేసీఆర్ సిద్ధమౌతున్నారు కదా! రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు వంటి కార్యక్రమాలపై ఆరా తీసి ఉంటారని కొన్ని కథనాలు వచ్చాయి. నిజానికి, ఈ విషయాలు పయ్యావుల నుంచే రాబట్టాల్సిన అవసరం లేదు కదా! పక్కకు పిలిచి మరీ అంత రహస్యంగా అడగాల్సిన అంశాలు ఇవి కావు.
మొత్తంగా, కేసీఆర్ అనంత పర్యటనపై వినిపిస్తున్న మరో విశ్లేషణలో పూర్తి రాజకీయ కోణమే ఉండటం విశేషం! పరిటాల సమాధి సందర్శనం, పయ్యావులతో రహస్య భేటీ, సీఎం చంద్రబాబుతో కుశల ప్రశ్నలు, వెరసి వీటన్నింటి వెనక కేసీఆర్ లక్ష్యం వేరే ఉందని అంటున్నారు! అదేంటంటే, తెలంగాణలోని సెటిలర్లను దృష్టిలో ఉంచుకుని, వారిని ఆకర్షించే లక్ష్యంగా ఈ పర్యటన సాగిందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్న తెలంగాణలోని ‘ఆ’ సామాజిక వర్గ ప్రజలకు దగ్గర కావడం అనేది కూడా ఇందులో మరోకోణంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. మొత్తానికి, ఏదైతేనేం… పరిటాల శ్రీరామ్ వివాహ వేదికపై కేసీఆర్ కొత్త చర్చకు తెరలేపినట్టు అయిందని చెప్పుకోవచ్చు!