కేటీఆర్, హరీష్ రావు చీకట్లో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు… ఢిల్లీ వెళ్లి బీజేపీతో దోస్తానా నడుపుతున్నారు అంటూ అసెంబ్లీ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. తాము కవిత బెయిల్ పై చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నట్లు కేటీఆర్, హరీష్ రావు చెప్పినా, తెర వెనుక జరిగింది ఇదే అంటూ కాంగ్రెస్ ఫైర్ అయ్యింది.
ఇప్పుడు కేటీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఈసారి కూడా హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. కవితతో ములాఖత్ అయ్యేందుకు అని బీఆర్ఎస్ వర్గాలు ప్రకటిస్తున్నా… మళ్లీ అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ తో పాటు ఎమ్మెల్యేలంతా పార్టీ వదిలిపోతున్న తరుణంలో బీఆర్ఎస్ అడుగులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
బీజేపీతో దోస్తీ ఉండదని కేంద్రమంత్రి బండి సంజయ్ వంటి వారు చెప్తున్నా, కాంగ్రెస్ మాత్రం బీజేపీ దోస్తీ సంప్రదింపుల కోసమే ఈ పర్యటనలు అని విమర్శిస్తోంది. బీజేపీతో అవగాహన వస్తే కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు సమాయత్తం అవ్వటంతో పాటు కవితను జైలు నుండి విడిచిపించుకునే లోపాయికారీ ఒప్పందాలపై చర్చల కోసమే ఇదంతా అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఓవైపు బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వలసలు ఉంటాయా…. కాంగ్రెస్ లోకి వలసలు ఆగే అవకాశం లేదా… అంటూ బీఎల్ సంతోష్ వంటి అధినాయకత్వంలోని కీలక వ్యక్తులు తెలంగాణపై ఫోకస్ పెంచుతున్న సమయంలో, కేటీఆర్-హరీష్ రావు ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా మారింది.
పార్టీ మారిన ఫిరాయింపుదారులపై నిపుణులతో చర్చిస్తామని, సుప్రీం కోర్టులో కేసు వేస్తామని తాజా పర్యటన సందర్బంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో న్యాయ నిపుణులతో కవిత బెయిల్ కోసం చర్చించేందుకు ఢిల్లీ వచ్చాం అని చెప్పటం… అనుమానాలకు తావిస్తోందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తం అవుతోంది.