భారీ సదస్సులు అనగానే నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుంది. ఇటీవలే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. అంతకు కొద్దిరోజుల ముందే గ్లోబల్ ఎంట్రప్రిన్యువర్ సమిట్ నిర్వహించారు. ఇవాంకా ట్రంప్ రావడం, నగరాన్ని సుందరకీకరించడం.. ఇలా కొంత హడావుడి చూశాం. ప్రభుత్వ తరఫున అనూహ్యమైన చొరవ కనిపించింది. అయితే, ఇప్పుడు అదే తరహాలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. ఈ కాంగ్రెస్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇక్కడి పరిస్థితులూ భద్రతా కారణాల పేరుతో హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమాన్ని మణిపూర్ సెంట్రల్ యూనివర్శిటీకి తరలించేశారు. ఫలితంగా మరోసారి ఉస్మానియాలో కొంత ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీరు, వైస్ ఛాన్సలర్ అసమర్థ వైఖరి వల్లనే ఈ సైన్స్ కాంగ్రెస్ వేదిక మారిందంటూ విమర్శించారు. దీంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఇంతకీ ఎవరి చొరవ లోపం వల్ల ఇంత ప్రతిష్టాత్మకమైన సదస్సు రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయింది..?
నిజానికి, ఇలాంటి సదస్సులు ఒకసారి తరలి వెళ్లిపోయాలంటే… భవిష్యత్తులో కూడా మళ్లీ హైదరాబాద్ వేదికగా పెట్టుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. ఇక, ఈ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ విషయానికొస్తే.. తెలంగాణ సర్కారు మొదట్నుంచీ కొంత ఉదాసీన వైఖరితోనే ఉంది. ఇది యూనివర్శిటీ వ్యవహారంగానే చూసిందని చెప్పాలి. కారణమేంటంటే… తెలంగాణ ప్రభుత్వం వెర్సెస్ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘాల మధ్య ఓరకమైన ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కొన్నాళ్లుగా ఉంది. ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్శిటీకి వెళ్లినా, అక్కడ ప్రసంగించలేకపోవడం, తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి లోకాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వారిలో కొంత ఉంది. దీంతో విద్యార్థి సంఘాలు కొంత గుర్రుగానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో యూనివర్శిటీలో సదస్సు అనగానే ఎలాంటి అననుకూల పరిణామాలు తలెత్తుతాయో అనేది ప్రభుత్వం ఉద్దేశం కావొచ్చు.
ప్రభుత్వం చొరవ చూపకపోయినా యూనివర్శిటీ నుంచి కూడా కొంత ప్రయత్న లోపం ఉందనే చెప్పుకోవచ్చు! వీసీ కొంత చొరవ ప్రదర్శించి ఉంటే బాగుండు అనే అభిప్రాయం వినిపిస్తోంది. అటు విద్యార్థి సంఘాలతోనూ ఇటు ప్రభుత్వ పెద్దలతోనూ చర్చలు జరిపి ఉంటే బాగుండేదేమో! అలాంటి ప్రయత్నమేదీ జరిగిన దాఖలాలు లేవు. ఇంత ప్రతిష్టాత్మకమైన సదస్సు రాష్ట్రానికి వస్తున్నప్పుడు… రాజకీయాలూ ఇతర అంశాలు ఏవి ఉన్నా కొన్నాళ్లు పక్కన పెట్టాలనే ఉద్బోధ చేసేంత ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం నుంచి సహకారం ఉండదనే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి.. తాము కూడా చేసేదేం లేదన్నట్టుగా చేతులెత్తేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు వేరే వేదిక చూసుకున్నారు. పక్క రాష్ట్రంలోని ఆంధ్రా యూనివర్శిటీ కూడా ఈ సైన్స్ కాంగ్రెస్ ను తమ దగ్గర నిర్వహించాలని కోరినా… తెలంగాణలో కాదని ఆంధ్రాకి వెళ్తే అదో తలనొప్పి వ్యవహారం అవుతుందని భావించారో ఏమో… ఏకంగా ఈశాన్య రాష్ట్రాలకు వేదికను మార్చేశారు. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం, ఉస్మానియా విద్యార్థి సంఘాల మధ్య బిగుసుకుంటున్న వాతావరణానికి అద్దం పడుతున్న మరో పరిణామంగా దీన్ని చూడొచ్చు.