అనుకున్నట్టే అంటున్నట్టే వైఎస్ఆర్సిసి ఎపి శాసనసభా సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించింది.జగన్ పాదయాత్ర ప్రకటనతో పాటే ఈ నిర్ణయమూ వెల్లడైంది. ఈ మేరకు గతంలోనే సూచనలు వచ్చినా శాసనసభా పక్ష సమావేశంలో లాంఛనంగా చర్చించి ప్రకటించారు. దీనికి వారు చెప్పే తర్కం ఏమంటే ఫిరాయింపుదారులు మంత్రులైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి గనక ఇప్పుడే నిరసన చెప్పాలని. లేకపోతే ఈ అంశం లలవాటుగా మారి మరుగునపడిపోతుందని వైసీపీ నేతలంటున్నారు. ఆ సభ్యులను తమ పార్టీ జాబితాలో చూపిస్తూ మీ ప్రభుత్వంలో ఎలా మంత్రులను చేస్తారన్న ప్రశ్న ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది వ్యూహం. దానికి తోడు ప్రత్యేక హౌదా, ప్రజా సమస్యలపై జగన్ పరిశీలనలు వాగ్గానాలు అన్నీ కలసి ఒక రాజకీయ వాతావరణం తెస్తాయని వైసీపీ ఆశిస్తున్నది. జగన్ వుంటేనే సభలో వైసీపీకి అవకాశం రానప్పుడు ఆయన లేకపోతే వస్తుందనే అశ కూడా వారికి లేదు. ప్రాంతీయ పార్టీలలో ప్రధాన అధినేత లేకుండా సభ్యులను పంపిస్తే ఎవరు ఏం మాట్టాడతారో ఎవరిపై ఏ కొత్త ప్రభావాలు పడాతాయోనన్న సందేహం కూడా కొంత వుండొచ్చు. అన్నీ కలసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ను ఇందుకు ఆదర్శంగా చెబుతున్నారు గాని ఆయన తను వ్యక్తిగతంగా మాత్రమే బహిష్కరించారు. తమ సభ్యులను అనుమతించారు. ఇక్కడ జగన్ ఆలోచన మరో విధంగా వుంది.