కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు విషయంలో టీడీపీ నేతలు, క్యాడర్ , సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారంలో వాస్తవాలు చాలా పరిమితంగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎస్పీ గంగాధర్ రావు ట్రాక్ రికార్డును చూసే ఆయనకు కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు నమోదు చేశారని.. కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని పీఏపై దాడి జరగగానే పరామర్శించారని .. ఆయన కొడాలి నాని కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపణలు ప్రారంభించారు. నిజానికి అంగళ్లు కేసులో ప్రభుత్వం చెప్పినట్లుగా చేయలేదనే ఆయనను రెండు సార్లు బదిలీ చేశారు.
గంగాధర్ రావు అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో అంగళ్లు గొడవలు జరిగాయి. ఆ గొడవలో చంద్రబాబు, టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని అప్పటి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. అయితే నిబంధనలను ఉల్లంఘించలేనని చెప్పడంతో ఆయనను పక్కన పెట్టి కింది స్థాయి అధికారులతో పని చేయించారు. తర్వాత గంగాధర్ రావుపై బదిలీ వేటు వేశారు. గంగాధర్ రావుకు సుదీర్ఘ సర్వీసు ఉంది. ఆయన సిన్సియర్ గా పని చేస్తారని టీడీపీ నేతలకూ తెలుసు. చంద్రబాబు హయాంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నిక్కచ్చిగా పని చేసినందుకు ఆయనకు ఆయనకు రావాల్సిన ఐపీఎస్ క్యాడర్ ను కూడా వైసీపీ ప్రభుత్వం ఆలస్యం చేసింది.
Read Also :వైసీపీ గిరిజన సంక్షేమాన్ని విస్మరించింది : సీఎం చంద్రబాబు
గుడివాడలో కొడాలి నాని పీఏను పరామర్శించారన్నది కూడా తప్పుడు ప్రచారమేనని.. సున్నితత్వం దృష్ట్యా… శాంతిభద్రతల పర్యవేక్షణ కోసమే ఎస్పీ అక్కడకు వెళ్లారు. బాధితుడితో మాట్లాడారు కానీ.. ఇందులో ఇతర రాజకీయ నేతల ఆదేశాలు తీసుకునేంత చాన్స్ లేదని చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ ట్రోలింగ్ తీవ్రతరం కావడంతో గుడివాడ ఘటనపై ఎస్పీ గంగాధర్ రావు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు వివరణ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎస్పీ పని చేస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నారు నర్సాపురం ఎంపిడిఓ మిస్సింగ్ కేసును చాలెంజ్ గా తీసుకుని ప్రత్యేక బృందాలు, స్పెషల్ పార్టీ టింలు ఏర్పాటు చేసి గల్లంతైన ఎంపీడీవో వెంకట రమణారావు మృతదేహాన్ని గుర్తించేందుకు ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా మిస్సింగ్ కేసులపై ఆయన నిరంతరం రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సైబర్ నేరాల నియంత్రణపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎస్పీ గంగాధర్ రావు…. పరారీలో ఉన్న 18 మంది నిందితులను పట్టుకొని జైలుకు పంపారు. బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే జిల్లాలో తనదైన ముద్ర వేసిన ఎస్పీ గంగాధర్ రావుపై టీడీపీ క్యాడర్ ట్రోలింగ్ సరి కాదన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ పెద్దల కన్నా.. సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేసేవారికి ఎక్కువ తెలుసా అన్న ప్రశ్న వస్తోంది.