ఒలింపిక్స్ ముగిశాయి. భారత్కు ఒక్క గోల్డ్ కూడా రాలేదని చాలా మంది నిరాశ పడుతున్నారు. వ్యవస్థల్ని తప్పు పట్టే వారున్నారు. ప్రజల్ని తప్పు పట్టే వారున్నారు. తప్పు ఎవరిదైనా అసలు పతకాలు రాకపోవడం నిజం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిందేమిటంటే… ఒలిపింక్స్ పతకాలు వచ్చినంత మాత్రాన …దేశం అభివృద్ధి చెందినట్లు కాదు.. రాకపోయినంత మాత్రాన వెనుకబడిపోయినట్లు కాదు. చేయాల్సింది ఏమిటంటే మనల్ని మనం కించపర్చుకోవడం ఆపేయాలి.
ఎవరి ప్రాధాన్యాలు వారివి !
ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. దేశ దేశానికి ప్రాధాన్యాలు మారిపోతాయి. చాలా దేశాల ప్రభుత్వాలకు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడమే మొదటి టాస్క్. కానీ కొన్ని దేశాలకు మాత్రం.. మౌలిక సదుపాయాలను దాటి మరికొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తూంటాయి. అలాంటి దేశాలు మాత్రం ఆటల్లో ముందు ఉంటాయి. అడపాదడపా కొన్ని దేశాలు పతకాలు సాధించినా.. అది ఆయా ఆటగాళ్ల వ్యక్దిగత సామర్థ్యంతో సాధించే విజయాలే కానీ.. వ్యవస్థల సాయంతో సాధించేవి మాత్రం అయి ఉండవు.
గెలిచినోళ్లు గొప్పే కానీ.. !
భారత్ లో 140 కోట్ల మంది ఉంటారు. ప్రభుత్వం వీరి అవసరాలు తీర్చి భవిష్యత్ ను కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో ఆటలకూ బడ్జెట్ పెడుతుంది. కానీ అది చాంపియన్లను చేయడానికి సరిపోదు. అంత మాత్రాన.. ప్రభుత్వాలు ఏమీ చేయలేని నిందించలేం. ఎందుకంటే.. దేశంతో పాటు అన్ని సౌకర్యాలు పెరుగుతాయి. అంతే కానీ ఒలింపిక్స్ టార్గెట్ గా క్రీడా సౌకర్యాలను మాత్రమే పెంచితే పెరగవు. అమెరికా, చైనాల్లో మెడల్స్ ఎలా సాధిస్తున్నారో అంటూ… కొన్ని వీడియోల్ని సోషల్ మీడియాలో తిప్పుతూ ఉంటారు. అవన్నీ ఫేక్. అక్కడి ప్రభుత్వాలు తమ దేశాల్లో ప్రమాణాల్ని క్రమంగా పెంచుకుంటూ వచ్చాయి. అక్కడ సాధ్యమయింది. మన దగ్గర సాధ్యమవ్వలేదు. అలాగే 170 దేశాల్లోనూ సాధ్యం కాలేదు. గెలిచినోళ్లు గొప్పే కానీ.. ఓడిపోయినోళ్లు లూజర్స్ కాదు.
మనల్ని మనం కించ పర్చుకోవడం ఎందుకు ?
వ్యవస్థల్ని తిట్టే వాళ్లు.. లోపాల్ని వెదికే వాళ్లు .. ఎప్పుడూ ఉంటారు కానీ.. మనల్ని మనం కించ పర్చుకోవడం మాత్రం ఎప్పటికప్పుడు ఆపేయాలి. మన యువత అది చేస్తున్నారు.. ఇది చేస్తున్నారు అని నిందించడం కూడా ఆపేయాలి. సమాజంతో పాటే జనం ఎదుగుతారు. దేశం ఎదుగుతుంది. దేశం ఎదిగిందంటే అందరూ ఎదిగినట్లే లెక్క. మన ప్రమాణాలు నెమ్మదిగా అయినా మెరుగుపడుతున్నాయి. అందుకు సంతోషించాలి.. అడుగు ముందుకేస్తున్నందుకు ఆనందపడాలి. !