మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో మోదీ తలూపుతూ కూర్చున్నారు. ప్రతి ప్రశ్నకూ ఆయన అమిత్ షా వైపే చూశారు. అదో పెద్ద ట్రోలింగ్ స్టఫ్ అయిపోయింది. అందుకే మళ్లీ మీడియా ముందుకు రాలేదు. ప్రస్తుతం ఇంటర్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్యూలు అంతా స్క్రిప్టెడ్ అనే ఆరోపణలు ఉన్నాయి. బలమైన ప్రశ్నలు ఎవరూ అడగడం లేదు.
అయితే అప్పుడప్పుడూ ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రశ్నలు వేస్తున్నారు జర్నలిస్టులు. ఓ ఇంటర్యూలో మీడియా మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు అంటే… ప్రధాని మోదీ భిన్నమైన సమాధానం ఇచ్చారు. భారతీయ మీడియాలో తటస్థత కొరవడింది…తాను ఒకటి చెబితే మరొకటి ప్రచారం చేస్తారు.. మీడియా ఇక ఎంత మాత్రం నిస్పాక్షిక సంస్థ కాబోదని అందుకే ప్రెస్ మీట్లు పెట్టడం లేదని సమాధానం ఇచ్చారు. మోదీ సమాధానం మీడియా వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే గత పదేళ్లలో మీడియా స్వరూపం మారిపోయిందంటే.. దానికి కారణం బీజేపేనే మరి.
ప్రధాన మీడియా సంస్థలు ఇప్పటికే కార్పొరేట్ గుప్పిట్లో చిక్కుకున్నాయి. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించే మీడియాలు తగ్గిపోయాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలు జాతీయ మీడియాగా చెప్పుకునే వాటిల్లో కనిపించకుండా పోయాయి. ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెట్టడం పెరిగిపోయింది. వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలపై ఎన్ని దాడులు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. న్యూస్ క్లిక్ ప్రబీర్ పురకాయస్థ దుస్థితే దీనికి నిదర్శనం.
మోదీ తాను మీడియాకు దూరంగా ఉండటానికి… మీడియాకు నిష్పక్షికత లేకపోవడమే కారణంగా చెబుతున్నారు., అదే నిజం అయితే ఆ తప్పు కూడా ఖచ్చితంగా బీజేపీదే అవుతుంది. బీజేపీ పాలనదే అవుతుందన్న సెటైర్లు సహజంగానే వినిపిస్తున్నాయి. అందులో నిజం ఉంది కూడా !