ప్రస్తుత మంత్రివర్గాన్ని చూసిన తరవాత ఎవరికైనా కొడాలి నాని, పేర్ని నానిలు చేసిన తప్పేంటి? వారిని ఎందుకు తొలగించారన్న చర్చ సహజంగానే వస్తోంది. వైసీపీలోనూ జరుగుతోంది. ఏపీలో కొడాలి నాని మంత్రి కాదు అంటే చాలా మంది ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో విపక్షాలపై రాజకీయం చేశారు. పౌరసరఫరాల మంత్రిగా ఉన్నా.. ఆయన తన శాఖపై ఎప్పుడూ సమీక్షలు చేయడం.. మాట్లాడటం లాంటివి చేయలేదు. టీడీపీపైకి ముఖ్యంగా చంద్రబాబుపై ధూషణల రాజకీయంలో చేయడంలో మాత్రం ఆయన ఎవర్నీ నిరాశపర్చలేదు. హైకమాండ్ ఎలా విమర్శించమంటే అలా విమర్శించేవారు. జగన్‌పై అత్యంత విధేయత చూపేవారు. జగన్ కారు డ్రైవర్‌గా పని చేయడానికి కూడా సిద్ధమని చెప్పేవారు.
అలాంటిది ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి అవసరం లేదని జగన్ భావించారని అంటున్నారు. అంత విధేయత చూపిన వాళ్లకీ కులం కోటాలోనే ప్రాధాన్యం ఇస్తారా ? సొంత మనిషిగా పక్కన పెట్టుకోలేరా ? పేర్ని నాని తన శాఖతో పాటు రాజకీయాలపైనా సమర్థంగా పని చేశారని చెప్పుకోవచ్చు. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని సమర్థించడంలో ఆయన స్టైల్ వేరు. ఆయన మంచి వాగ్ధాటి ఉన్న నేత . ఆయనను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వైఎస్ఆర్సీపీ నేతలకూ అర్థం కావడం లేదు.
పేర్ని నాని తనను తాను వైఎస్ కుటుంబానికి పెద్ద పాలేరునని ప్రకటించుకున్నారు. పార్టీకి.. ప్రభుత్వానికి తలలో నాలుకలా వ్యవహరించారు. ఆయన పదవిని ఎందుకు తప్పించారన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కని విషయం అనుకోవచ్చు. పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడటంలో ఆయన స్టైలేవేరు. నిజానికి ఆయనకు సామాజిక సమీకరణం కూడా కలసి వస్తుంది. కానీ ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాని పరిస్థితి. కారణాలేమైనప్పటికీ…. ఏపీలో మూడేళ్ల పాటు మంత్రులు అంటే పదే పదే తెర ముందుకు వచ్చిన ఇద్దరు నానిలు ఇప్పుడు తెర వెనక్కి వెళ్లాల్సిందే. వారికి ఏ ఇతర పదవులు ఇచ్చినా మంత్రి పదవులతో సాటి రావు. ఆ నానిలను జగన్ ఎవరి సలహాలతో దూరం చేసుకున్నారో ఆయనకే తెలియాలి.