వైసీపీ నేతలను రెడ్ బుక్ నిద్రపోనివ్వడం లేదు. కలలో కూడా అదే గుర్తుకు వస్తున్నట్లు ఉంది..అందుకే రెడ్ బుక్ అంటూ ఒకటే కలవరిస్తున్నారు. అరెస్టులు తమ వరకు వస్తాయనే ఆందోళనో ఏమో కానీ, రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు చేస్తున్నారంటూ జగన్ , సజ్జలతో సహా తాజాగా పేర్ని నాని గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలకు బలమైన కౌంటర్ లు ఇస్తున్నారు. ఐదేళ్లు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదా, అయినా రెడ్ బుక్ గురించి మీకేం తెలుసునని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలకు ఏడాది ముందే ఈ రెడ్ బుక్ ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ.. అప్పట్లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, నిబంధలకు విరుద్దంగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్ లో రాసుకుంటున్నామని నారా లోకేష్ ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు.
Also Read : జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల భూదందాపై విచారణ
భారత రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న ఎవర్నీ అధికారంలోకి వచ్చాక వదలబోమని హెచ్చరించారు. ఇక, కూటమి సర్కార్ పవర్ లోకి రావడంతో అక్రమ కేసులు నమోదు చేయించిన వైసీపీ నేతలు, వారి కనుసన్నలో పని చేసిన పోలీసులు హడలిపోతున్నారు. అయితే, తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగబోదని..చట్టం ప్రకారమే నడుచుకుంటూ వెళ్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో సహా నారా లోకేష్ స్పష్టం చేశారు.
పార్టీ పెద్దల ప్రకటనలపై క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేసినా.. రెడ్ బుక్ అంటే రౌడీయిజం కోసం రూపొందించింది కాదు.. రాజ్యాంగాన్ని అమలు చేయాలని సూచించేది మాత్రమేనని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు అదే పద్ధతిని అవలంభిస్తున్నా.. వైసీపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. రెడ్ బుక్ కూడా వైసీపీ హయాంలో అమలు చేసిన రాజారెడ్డి రాజ్యాంగం తరహాలో అమలు చేస్తే…జగన్ తో సహా ఎవరూ బయట ఉండరని.. కానీ పూర్తిగా ప్రజాస్వామ్య విలువలు, చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని గుర్తు చేసే రెడ్ బుక్ పై ఈ ఏడుపు ఏంటి అంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.