త్వరలో తెలుగు బాక్సాఫీసు కళకళలాడబోతోంది. కొత్త సినిమాలు వెల్లువలా రాబోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే.. రిలీజ్ డేట్లు ప్రకటించేశారంతా. ఆర్.ఆర్.ఆర్ని మార్చి 25న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇది వరకటిలా రెండు డేట్లు ఇవ్వకపోవడంతో… ఈ రిలీజ్ డేట్ పై భరోసా ఏర్పడింది. దాంతో.. మిగిలిన సినిమాలకు లైన్ క్లియర్ అయినట్టైంది. వరుసగా ఆచార్య. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట రిలీజ్ డేట్లు బయటకు వచ్చేశాయి. మే 12న `సర్కారు వారి పాట`ని విడుదల చేస్తున్నారు. భీమ్లా నాయక్ కు మాత్రం రెండు రిలీజ్ డేట్లు వచ్చాయి. అయితే ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న ఈచిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఫిబ్రవరి 25నే ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్నది ఓ టాక్. ఏప్రిల్ 29న ఆచార్య రాబోతోంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా విడుదల తేదీ ప్రకటించింది. ఎఫ్ 3.. ఒకరోజు ముందుగా అంటే ఏప్రిల్ 28న వస్తోంది. రెండు పెద్ద సినిమాల మధ్య ఒకటే రోజు గ్యాప్ ఉంది. మళ్లీ ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఏర్పడింది.
పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటించుకుంటే.. రాధే శ్యామ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. మార్చి 4న ఈ సినిమాని విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ డేటు ప్రస్తుతానికి ఖాళీ. అది.. రాధే శ్యామ్ కోసమే అని, ఈ డేట్ ని చిత్రబృందం లాక్ చేసిందని, ఏ క్షణంలో అయినా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో మళ్లీ కొత్త రిలీజ్ డేట్లు వచ్చాయి. అయితే ఇవే పక్కా డేట్లు అని చెప్పలేం. ఏ ఒక్కరు అటూ ఇటూ వెళ్లినా, ఆ ప్రభావం మిగిలిన అన్ని సినిమాలపైనా పడుతుంది. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ అనుకున్న సమయానికి రావాలి. లేదంటే.. ఈ రిలీజ్ డేట్ల పేకమేడ
చటుక్కున కూలిపోతుంది.