రిలయన్స్… ఎందెందుకు వెతికినా అందందు కలదు అన్నట్లుగా ఒక్కో రంగంలోకి అడుగు పెడుతూనే ఉంది. దూసుకుపోతూనే ఉంది. ఇప్పటికే జియో మార్ట్ పేరుతో సేవలు అందిస్తున్న రిలయన్స్ త్వరలో క్విక్ డెలివరీస్ కూడా చేయబోతుంది.
అవును ఇప్పటికే ఉన్న బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో వంటి సంస్థలకు పోటీ జియో క్విక్ మార్ట్ ను తీసుకరాబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్డర్ చేసిన 30నిమిషాల్లో డెలివరీ చేసేలా ప్రణాళికలు చేశారని, ఇందుకోసం ఇప్పటికే ప్రతి నగరంలో అందుబాటులో ఉన్న రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ అవుట్ లెట్స్ ను ఉపయోగించుకోవాలని ప్రణాళికలు వేసింది.
రిలయన్స్ ఫ్రెష్, జియో మార్ట్ కు అనుబంధంగా ఉన్న ఔట్ లెట్స్ తో పాటు గ్రౌండ్ లెవల్ వరకు ఉన్న చైన్ రిలయన్స్ కు అదనపు బలంగా మారబోతుంది. అయితే, ముందుగా కేవలం నిత్యవసర సరుకులు, తాజా కూరగాయల వరకు మాత్రమే పరిమితం అవ్వాలని, భవిష్యత్ లో ఈ సేవలను దుస్తులు సహా అన్నింటికీ వర్తింపజేయాలన్న ఆలోచన ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఓ ప్రత్యేక టీం దీనిపై ఫోకస్ చేసిందని, మొదట మెట్రో నగరాల్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత టైర్-2 సిటీస్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. అన్నీ కుదిరితే వచ్చే నెలాఖరులో జియో క్విక్ మార్ట్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.