ఏపీలో మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వం ఓ స్పష్టతకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. మద్యం దుకాణాల్లో గౌడ వర్గానికి రిజర్వేషన్ కల్పించి ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీలు అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీల అధ్యయనం కోసం అధికారులతో నాలుగు టీమ్ లను సర్కార్ ఏర్పాటు చేసింది. లిక్కర్ పాలసీ కోసం ఏర్పాటు చేసిన అధికారుల ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఆఫీసర్లు ఉన్నారు.
తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లి ఆ రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని పరిశీలించనున్నాయి. ఆ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు, లిక్కర్ షాపులు, బార్లలో మద్యం ధరలు, మద్యం నాణ్యత, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ అధికారుల బృందాలు అధ్యయనం చేయనున్నాయి. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారు.
మరో వైపు .. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి ముందే లైసెన్స్ ల వేలం వేసింది. అందులో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు కూడా గౌడలకు ఆ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. జగన్ లిక్కర్ పాలసీ అవినీతి కోసమే తెచ్చిందని తేలడంతో.. ఇప్పటికే విచారణకు ఆదేశించారు.