దేశం మొత్తం కశ్మీర్ వైపు చూస్తున్న సమయం…! దేశం కోసం ప్రాణాలకు తెగించిన అభినందన్ పాకిస్థాన్ చెరలో ఎన్ని చిత్రహింసలు పడుతున్నాడో అని ప్రజలంతా ఆందోళన చెందుతున్న సమయం…! ఆయనను వెనక్కి తేవడానికి కేంద్రం ఏం చేయబోతున్నారో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం…!. అలాంటి సమయంలో పీయూష్ గోయల్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఏపీకి రైల్వేజోన్ ప్రకటించారు. ఈ జోన్ కోసం.. ఏపీ మొత్తం హోరెత్తిన రోజుల్లో నిమ్మకు నీరెత్తినట్లు ఉండి.. ఇప్పుడీ ప్రకటన చేయడమే ఆశ్చర్యకరం. కానీ ఇందులోనూ ఓ వ్యూహం ఉంది. ఇలాంటి సమయంలో ప్రకటిస్తే.. ఏపీకి ఇచ్చింది రైల్వేజోన్ కాదు .. రైల్వేజోన్ అనే బోర్డు మాత్రమే.. అనే విషయాన్ని మరుగునపడేయవచ్చు .. అనేదే ఆ వ్యూహం.
ఖర్చులన్నీ విశాఖ రైల్వే జోన్‌కు.. ఆదాయం పక్క రాష్ట్రానికా..?
దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు బోర్డు మాత్రం ఘనంగా ఉంది. కానీ ఆదాయం, పరిధులు సహా ఏ అధికారమూ సంపూర్ణంగాఉండదు. అసలు ఉత్తరాంధ్ర వాసులు జోన్ కోరుకున్న కారణం వాల్తేర్ డివిజన్. దేశంలోనే అత్యధిక ఆదాయం సంపాదించే డివిజన్లలో టాప్ ఫైవ్‌లో ఉంటుంది వాల్తేర్. గత ఏడాది రూ.7,500 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టింది. కోరాపుట్, కిరండోల్ లైన్ల పరిధిలో బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజం రవాణాయే దీని ప్రధాన ఆదాయ వనరు. విశాఖ రైల్వే జోన్లో.. అసలు సరకు రవాణానే లేకుండా చేసేశారు. కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తాలో… ఒక్క పాసింజర్ విభాగం మాత్రమే ఉంచారు. విశాఖలోని రెండు పోర్టుల వరకు ఇనుప ఖనిజం రవాణా అయినప్పటికీ ఇసుమంత ఆదాయం కూడా కొత్త జోన్‌కు రాదు. ఇంకా విశేషం ఏమిటంటే.. అత్యంత క్లిష్టమైన కేకే లైన్ నిర్వహణ కొత్త జోన్‌కు వస్తుంది. ఆ మార్గాల ద్వారా వచ్చే సరకు రవాణా ఆదాయం ఒడిషాకు పోతుంది.
వాల్తేర్ డివిజన్ ఏం పాపం చేసింది..? “మరో చరిత్ర”లో కలిపేశారు..!
మరో చరిత్ర సినిమాను బ్లాక్ అండ్ వైట్‌లో చూస్తూ ఉంటే.. వాల్తేర్తో కూడా ప్రేమలో పడకుండా ఉండని సినీ ప్రేక్షకుడు ఉండరు. రైల్వేతోనూ ఈ వాల్తేర్‌కు 125 ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ డివిజన్‌ను చరిత్రలో కలిపేశారు. ఈ డివిజన్‌ను రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్లో కలిపారు. మరో ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే… విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదు. ఇప్పటిదాకా డివిజన్ కేంద్రాన్ని జోన్‌గా అప్‌గ్రేడ్ చేసినప్పుడు, డివిజన్లను యథాతథంగానే ఉంచారు. ఇప్పుడు వాల్తేరు విషయంలో కొత్త సంప్రదాయానికి తెరలేపారు. సరుకు రవాణాలో కీలకమైన కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢలోనే కలిపేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్లో ఉన్నాయి. వీటిని కూడా.. విశాఖ రైల్వేజోన్‌లో చేర్చలేదు.
రిక్రూట్మెంట్ బోర్డు కోసం మరో ఉద్యమం చేయాలా..?
ఉద్యోగాల ఆశలు పెట్టుకున్న యువతకు.. మోడీ సర్కార్ పెద్ద బ్లో ఇచ్చింది. జోన్ అనే పేరే కానీ..ఆ లక్షణం ఒక్కటి కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు జోన్‌కు అనుబంధంగా రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు రాసేందుకు ఉత్తరాంధ్ర యువకులు జోన్ కేంద్రాలైన హైదరాబాద్ లేదా భువనేశ్వర్ వెళ్లాల్సి వస్తోంది. భువనేశ్వర్‌లో పరీక్ష రాయడానికి వెళ్లిన వారిపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. విశాఖ జోన్ వస్తే ఇక్కడే ఉద్యోగ నియామక పరీక్షలు రాయవచ్చునని భావించారు. కానీ… ఇప్పుడు జోన్‌తో రిక్రూట్మెంట్ బోర్డు ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. దీని కోసం మరో ఉద్యమం చేయాల్సి రావొచ్చు.