కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సలహాదారుగా ఉన్న సుభాష్ చంద్రగార్గ్ ఆరోపణలు చేయడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆయనను ఎప్పుడో ఏడాది కిందట వరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి.. విద్యుత్ శాఖలో పోస్టింగ్ ఇచ్చారు. తనను ఆర్థిక శాఖ నుంచి తప్పించడాన్ని అవమానంగా ఫీలైన ఆయన… అప్పుడే సర్వీస్ నుంచి వైదొలిగారు. మార్చి మొదట్లో ఆయనను ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా తన బదిలీపై ఆయన ఇంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా.. కేంద్ర ఆర్థిక మంత్రిపై విమర్శలు గుప్పిస్తూ తెరమీదకు వచ్చారు. తన బ్లాగ్‌లో చాలా రాశారు.
నిర్మలా సీతారామన్ పై చాలా ఆరోపణలు చేశారు. ఆమెది విచిత్రమైన వ్యక్తిత్వమని.. ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. ప్రతీ విషయంలో ఇతరులపై ఆధారపడతారన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి అనువైన సంస్కరణలను తీసుకునే సామర్థ్యం నిర్మలకు లేదని ఆయన తేల్చేశారు. సుభాష్ చంద్రగార్గ్ అంతకు ముందు కూడా ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. అరుణ్ జైట్లీతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. సుభాష్ చంద్ర గార్గ్ ఆరోపణలు కేంద్ర ఆర్థిక శాఖలోనూ.. కేంద్ర ప్రభుత్వ వర్గాల్లోనూ కలకలం రేపాయి. తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. సాధారణంగా ఇలాంటి ఆరోపణలను… ఎవరైనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత వెంటనే చేస్తారు. లేకపోతే.. సంబంధిత వ్యక్తులు పదవి కోల్పోయిన తర్వాత చేస్తారు. కానీ గార్గ్ ఎందుకు హఠాత్తుగా నిర్మలాసీతారామన్‌పై విరుచుకుపడుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
కేంద్ర ఆర్థిక శాఖలో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందో గార్గ్‌కు స్పష్టంగా తెలుసు., అయినప్పటికీ.. ఒక్క నిర్మలా సీతారామన్‌ను టార్గెట్ చేయడం వెనుక.. కారణం ఉందని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దల రాజకీయ వ్యూహం.. తమకు ఎదురు తిరిగిన వారిపై.. ఆరోపణల యుద్ధం ప్రకటించడం. టీడీపీ నేతల నుంచి న్యాయవ్యవస్థ వరకూఅదే జరుగుతోంది. ఇప్పుడు నిర్మలాసీతారామన్పైనా అదే ప్రయోగిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. గతంలో నిర్మలా సీతారామన్‌ను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించారు కూడా. ఇప్పుడు పోలవరంతోప ాటు.. ఇతర నిధుల విషయంలోనూ.. గట్టిగా వ్యవహరిస్తూండటంతో.. ఆమెనూ టార్గెట్ చేశారని అంటున్నారు. దానికి సుభాష్ చంద్రగార్గ్ను ఉపయోగించుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి అదే నిజమైతే.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ దేనికైనా తెగించినట్లుగా భావించాలేమో..?