రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక ఉద్యోగులు అడగకపోయినా రిటైర్మెంట్ వయసును 62కి పెంచిన ఏపీ ప్రభుత్వం… ఈ ఫార్ములాను మరికొంత కాలం పొడిగించుకునే అవకాశం కనిపిస్తోంది. మరో ఏడాది పదవి విరమణ వయసు పెంచడానికి కసరత్తు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. పీఆర్సీ ప్రకటించినప్పుడు…. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోవడంతో.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక… రెండేళ్ల వయసు పెంచింది. దీంతో అప్పటికప్పుడు రిటైరవ్వాల్సిన ఉద్యోగులకు మరో రెండేళ్ల సర్వీస్ లభించింది.
ఇలా వీరంతా.. ఈ ఏడాది చివరి నుంచి రిటైరయ్యే అవకాశం ఉంది. అప్పుడు ప్రభుత్వ వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మందికి గతంలో రిటైరైన వారికి బెనిఫిట్స్ ఇవ్వలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇరవై వేల కోట్ల వరకూ ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లించాలని గవర్నర్ వద్దకూ వెళ్లారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతల గుర్తింపు రద్దు చేస్తామని ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. ఇలాంటి సమయంలో ఒక్క సారిగా పెద్ద ఎత్తున ఉద్యోగులు రిటైర్ అయితే వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం కష్టమవుతుంది.
దీనికి పరిష్కారంగా మరో ఏడాది పదవీ విరమణ వయసు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అలా చేస్తే వచ్చే ఎన్నికల తర్వాతనే ఇక రిటైర్మెంట్లు ఉన్నాయి. అప్పుడు జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని… ఆర్థిక సమస్యలు కొత్త ప్రభుత్వం తీర్చుకుంటుందని అంటున్నారు. ఇదే ఉద్దేశంతోనే ఇలా వాయిదాలు వేస్తున్నారని.. జగన్ గెలుస్తారన్న నమ్మకం ఉంటే.. సమస్యలను ఇప్పుడే పరిష్కరించుకుంటారు కదా అని ప్రశ్నిస్తున్నారు.