తెలంగాణ ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కాచుకుని కూర్చున్న గవర్నర్ తమిళిసైకి మెడికల్ పీజీ సీట్ల స్కాం గొప్ప అవకాశంగా మారినట్లుగా కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం యూనివర్శిటీలకు చాన్సలర్ గవర్నరే. ఇతర విషయాల్లో అధికారాలు ఉన్నా లేకపోయినా… యూనివర్శిటీల విషయంలో గవర్నర్‌కు కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ క్రమంలో కాళోజీ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో ని మెడికల్ కాలేజీల్లో పీజీ అడ్మిషన్లలో రూ. కోట్ల దందా బయటపడింది. పోలీసు కేసుల వరకూ వెళ్లింది.
చాలా మంది మెరిట్ విద్యార్థులకు పీజీలో సీట్లు దొరకలేదు. కానీ వారి కన్నా తక్కవ మెరిటన్ ఉన్న వారికి లభించాయి. ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె పీజీ సీటు రాదేమోనని మానసిక ఒత్తిడికి గురయి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కాం బయటపడటం సంచలనాత్మకం అవుతోంది. ఈ స్కాంపై తక్షణం విచారణ జరపాలని రేవంత్ రెడ్డి గవర్నర్‌కు లేఖ రాశారు. పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ సహా అనేక మెడికల్ కళాశాలల యజమానులు టీఆర్ఎస్ లోనే ఉన్నారు. అందరిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే గవర్నర్ ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని కాళోజీ యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌ను ఆదేశించారు. ఆయన నివేదిక ఇస్తారో లేదో కానీ ఈ అంశంలో గవర్నర్‌కు మంచి అవకాశం దొరికినట్లే భావిస్తున్నారు. పీజీ మెడికల్ సీట్లలో స్కాం జరిగినట్లుగా తేలడంతో ఇప్పుడు అక్రమార్కుల్ని..నిందితుల్ని బయటకు తెచ్చి జైలుకుపంపాల్సి ఉంది.