తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు అసెంబ్లీ వేదికగానే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. గత ప్రభుత్వం మాదిరి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోకుండా ఉండేలా రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ తల్లి, రాష్ట్ర అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం విషయంలో మార్పులు, మార్పులపై ప్రభుత్వ నిర్ణయం వివాదాలకు దారితీసింది. ఇన్నాళ్లు ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచిన కొంతమంది ఉద్యమకారులు సైతం రేవంత్ వైఖరిపై పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో మొండిపట్టుదలకు వెళ్లకుండా ఏకాభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామని కేవలం రాష్ట్ర గేయాన్ని మాత్రమే ఫైనల్ చేసి చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులను పెండింగ్ లో ఉంచారు.
రాష్ట్ర అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై జులైలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సభ ఏకగ్రీవ ఆమోదంతోనే ఈ విషయంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. అంతే కాకుండా రైతు భరోసా, ధరణి, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై అసెంబ్లీలో చర్చించే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు రేవంత్.
ప్రజా పాలనను ప్రతిబింబించేలా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల కోసం అసెంబ్లీని వేదికగా తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు, వివాదాలకు తావు లేకుండా ఉంటుందని రేవంత్ అంచనా వేస్తున్నట్లుగా స్పష్టం అవుతోంది.