మోటార్లకు మీటర్లు పెడితే రైతుకు ఉరి వేయడమేనని తాను ఆ పని చేయడానికి సిద్ధంగా లేను కాబట్టే వేల కోట్లు అప్పులు ఇవ్వలేదని కేసీఆర్ చాలా సార్లు బహిరంగసభల్లో చెప్పారు. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతే కాదు కక్కుర్తి పడి ఏపీలో రైతుల మెడకు జగన్ ఉరి వేశారని.. తాను అలాంటి పరిస్థితిని రానివ్వబోనని కూడా భరోసా ఇస్తూ ప్రకటనలు చేసేవారు. కానీ అసలు వాస్తవం మాత్రం వారు మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ పత్రాలను బయట పెట్టారు. మూడేళ్ల కిందటే చేసుకున్న ఒప్పంద పత్రాలను బయట పెట్టి రేవంత్ రెడ్డి.. తీవ్రమైన విమర్శలు చేశారు. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత వరకూ సమాధానం చెప్పుకోలేదు. ఎదురుదాడి చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. ఒప్పందం చేసుకున్నా తాము మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేయలేదని వాదించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించే చాన్స్ ఉంది.
అయితే బీఆర్ఎస్ నిర్వాకం వల్లనే ఇప్పుడు మోటార్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ సర్కార్ చెబుతోంది. తాము ఒప్పందం చేసుకున్నా.. ఆ విషయం ప్రజలకు అనవసరం అని.. మీటర్లు పెట్టబోయేది రేవంత్ సర్కారే కాబట్టి వ్యతిరేకత వారికే వస్తుందని ఆ దిశగా ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ప్రచారాన్ని తిప్పికొట్టడం రేవంత్‌కు కూడా కీలకమే.