బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి కానీ బీజేపీకి ఇవ్వబోవన్న ఓ లాజిక్ ను ఆయన బయటపెట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల రాజకీయ విశ్లేషకుల్లో ఇలాంటి అనుమానాలు ఉన్నా… కాస్త తరచి చూస్తే… ఊగిసలాడే ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ప్రాంతీయపార్టీలు కూడా సిద్ధంగా ఉండవని రాజకీయ పరిమాణామాలు నిరూపిస్తున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నదో లేదో వారికే క్లారిటీ లేదు. మమతా బెనర్జీకి బెంగాల్ లో పట్టు నిలుపుకోవడం ముఖ్యం. బీజేపీని బెంగాల్ లో బలహీనం చేసే అవకాశం వస్తే వదిలి పెట్టరు. అలాంటి అవకాశం.. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా సంపాదించుకోవచ్చు. కేంద్రంలో బీజేపీకి సీట్లు అవసరమైతే ముందుగా మమతా బెనర్జీనే సాయం చేస్తారు. తద్వారా బెంగాల్ లో తమ జోలికి రావొద్దని ఒప్పందం చేసుకుంటారు. కేంద్రంలో ప్రభుత్వం కోసం బెంగాల్ బీజేపీని త్యాగం చేయక తప్పని పరిస్థితి కమలం పార్టీ నేతలకు వస్తుంది.
మమతా బెనర్జీ మాత్రమే కాదు.. నవీన్ పట్నాయక్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీకే మద్దతు ప్రకటిస్తారు. ఇక మూడు, నాలుగు సీట్లపై ఆశలు పెట్టుకున్న వైసీపీ కూడా తమ మద్దతు బీజేపీకేనని చెబుతూ వస్తున్నారు. మోదీని కాదని కలగూర గంప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎంతకాలం ఉటుందో చెప్పలేరు. తర్వాత మళ్లీ మోదీ ప్రధాని అయితే ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం అందుకే.. చాలా వరకూ ప్రాంతీయ పార్టీలు.. కాంగ్రెస్ పార్టీ రెండు వందల వరకూ సీట్లు సాధిస్తేనే ఆపార్టీతో ఉంటాయి. లేకపోతే బీజేపీకే అడ్వాంటేజ్.
అయితే ఈ చర్చ అంతా బీజేపీకి సీట్లు తగ్గినప్పుడే. మెజార్టీ మార్క్ ను బీజేపీ దాటని ఇప్పటి వరకూ ఒక్క సర్వే కూడా చెప్పడం లేదు. కాంగ్రెస్ సానుభూతిపరులు మాత్రం 220కే పరిమితమవుతుందని ఆశపడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇలాగేనే అనుకున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో ?