ఒక్క ఛాన్స్.. ఈ మాటకు రాజకీయాల్లో చాలా విలువ ఉంది. సుదీర్ఘ కాలంగా కష్టపడుతున్న రాజకీయనాయకుడు ఇలా అడిగితే ప్రజలు కరిగిపోతారు. వైఎస్ , ఆయన కుమారుడు అలాగే చాన్సులు పొందారు. తర్వాత వారేమి చేశారన్న విషయం పక్కన పెడితే.. ప్రజలు మాత్రం ఈ పిలుపునకు ఆకర్షితులవుతారు. కేసీఆర్కు ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డేనని ప్రజల్లో మంచి నమ్మకం ఉన్న సమయంలో.. ఆయన కూడా ఇదే అస్త్రాన్ని ఎంచుకుంటున్నారు.
బహిరంగ సభల్లో ప్రజలను కోరుతున్న ఒకే ఒక్క మాట ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కోరుతున్నారు. పాదయాత్రలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఒక్క అవకాశం ఇవ్వండి అని. ఆయన చేస్తున్న పాదయాత్ర అనంతరం జరుగుతున్న కార్నర్ మీటింగ్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుతున్నారు రేవంత్. ఆయన నోట మాటను కాంగ్రెస్ నాయకులు సైతం ప్లీస్ వన్ ఛాన్స్ అంటూ జపిస్తున్నారు. ఈ మంత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందా… అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది.
క్యాడర్ లో మరింత జోష్ నింపేందుకు తాను పర్సనల్ గా వారిని మోటివేట్ చేస్తున్నారు. రేవంత్ యాత్రకు యువత నుంచి కూడా మద్దతు వస్తోంది. మరోవైపు రేవంత్ చేస్తున్న పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేల అవినీతి భాగోతంపై ఛార్జీషీట్ పేరుతో స్థానిక నాయకులతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఇదిగో అంటూ ఛార్జి షీట్ పేరుతో ప్రజలకు వివరిస్తున్నారు. .స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తూ… ఇటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అవినీతిని ఛార్జ్ షీట్ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తూ… ఒక్క అవకాశం ఇవ్వండి అన్న నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు రేవంత్ రెడ్డి.