తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపడుతున్న బస్సు యాత్రల్లో ఇకపై రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది..! ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ యాత్రల్లో పాల్గొనకూడదని రేవంత్ స్వయంగా నిర్ణయించుకున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. తన వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తితోనే రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి, రేవంత్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నాక.. కీలకమైన పదవి కట్టబెడతారని అనుకున్నారు. అదేంటన్నది ఇప్పటికీ హైకమాండ్ స్పష్టత ఇవ్వడం లేదు. సరే, దాని కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా బస్సు యాత్రల్లో ఆయన పాల్గొంటున్నారు. నిజానికి, ఈ యాత్రల్లో రేవంత్ ను చూడ్డానికే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మాట వాస్తవం. రేవంత్ ప్రసంగం పూర్తికాగానే, జనాలు వెనక్కి వెళ్లిపోవడం కూడా ఆ పార్టీ నేతలకు తెలిసిన అంశమే.
అయితే, పార్టీలో చేరిన దగ్గర నుంచీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నా కూడా రేవంత్ విషయానికి వచ్చేసరికి ఆయన వైఖరి మరోలా ఉంటోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం పదవి రేసులో తాను లేనని రేవంత్ ప్రకటించినా కూడా, ఇంకా ఏదో అనుమానంగా తనని చూస్తున్నట్టు రేవంత్ భావిస్తున్నారట. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన కొంతమంది నేతల పదవులకు సంబంధించి ప్రతిపాదనల్ని కూడా ఉత్తమ్ లైట్ తీసుకుంటున్నారట. రేవంత్ పంపిన ప్రదిపాదనలు ఇంకా ఆయన దగ్గరే ఉన్నాయనీ, అధిష్టానానికి నివేదించే ఉద్దేశం ఆయనకి లేనట్టుగా ఉందంటూ రేవంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, తన వర్గంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందంటూ కొంతమంది మధ్యవర్తుల ద్వారా రేవంత్ వర్గానికి రాయబారాలను ఉత్తమ్ నడుపుతున్నారన్న కథనాలూ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
దీంతో రేవంత్ మౌనంగా ఉండిపోతున్నారనీ, ఇకపై తన సొంత నియోజక వర్గం కొడంగల్ కు పరిమితం కావాలని భావిస్తున్నట్టుగా కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే, బస్సు యాత్రకు రేవంత్ రావాలనీ, ఆయన వచ్చి మాట్లాడుతుంటేనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందంటున్న నేతలూ కాంగ్రెస్ లో కొంతమంది ఉన్నారు! ఏదేమైనా, కాంగ్రెస్ లోకి చేరిన తరువాత రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఆశించిన ఆకర్షణీయంగా ఏమీ లేదు. కనీసం ఎన్నికల సమయం వచ్చేసరికైనా ఆ పార్టీలో సముచిత స్థానం దక్కుతుందో లేదో చూడాలి. నిజానికి, కాంగ్రెస్ లో స్టార్ కేంపెయినర్ రేవంత్. ఆయన సేవల్ని కాంగ్రెస్ సరిగా వినియోగించుకోలేకపోతోంది. ఆధిపత్య పోరులో పడి కొట్టుకుంటూ భవిష్యత్తుపై సరైన వ్యూహం లేకుండా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.