ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను ఆచరణలో పెట్టేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంతో కేసీఆర్ కు చెక్ పెట్టడమే కాకుండా అమరవీరులు, రైతాంగానికి కాంగ్రెస్ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది అనే సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలా రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేసినట్లుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది. ఈ రాజముద్రకు సంబంధించి సోషల్ మీడియాలో పలు ఫోటోలు వైరల్ అయినా, తాజాగా ఓ చిహ్నం ఫైనల్ అయినట్లుగా సమాచారం. ఈ లోగోలో అమరవీరుల స్థూపం, వరి కంకులతో పాటు దేశానికి గర్వకారణమైన అశోక చక్రం ఉండనున్నట్లుగా తెలుస్తోంది.
గత ప్రభుత్వం ఆవిష్కరించిన రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని కొత్త లోగోలో అమరవీరుల స్థూపం, వరి కంకులకు రేవంత్ సర్కార్ చోటు కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని పదేళ్లుగా బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఒక్కరితోనే స్వరాష్ట్రం ఏర్పడలేదు… అనేక మంది అమరుల త్యాగఫలితమే తెలంగాణ అని నిత్యం గుర్తుచేసేలా అమరవీరుల స్థూపానికి ఎంబ్లమ్ లో రేవంత్ చోటు కల్పించి ఉండొచ్చునని విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రైతాంగం కేసీఆర్ ను దేవుడిలా ఆరాధిస్తోంది. దీంతో కేసీఆర్ ను మించి వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పే ఉద్దేశంతోపాటు, తెలంగాణ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రజల జీవనాధారం పాడి పంటలు అయినందున చిహ్నంలో రైతాంగం ప్రతిబింబించేలా ఉండాలని ఈ మార్పులను రేవంత్ సూచించి ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పులకు కారణం రాజకీయమైన, మరేదైనప్పటికీ.. రేవంత్ నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు స్వాగతిస్తుండటం విశేషం.