హరీష్ రావు.. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్. పార్టీ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా కేసీఆర్ కూడా హరీష్ రావునే రంగంలోకి దింపుతుంటారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున అన్ని తానై హరీష్ వ్యవహరిస్తున్న హరీష్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్నా ఆయన ప్లాన్ గురి తప్పింది. ఫలితంగా అది హరీష్ రావునే ట్రబుల్ లో పడేసేలా చేసింది.
అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఆర్టీసీపై జరిగిన చర్చలో భాగంగా హరీష్ రావు మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారని, ఎప్పటిలోగా పునరుద్దరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చినా హరీష్ శాంతించలేదు. ఇదే అంశంపై సీపీఐ శాసన సభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ హరీష్ నోరు మూయించారు. ఆర్టీసీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావును ఎట్లా తొలగించాలో తెలియక..ఆనాడు కేసీఆర్ కార్మిక సంఘాలనే తీసేశారు. హరీష్ రావు గతాన్ని గుర్తుచేసుకోవాలని అలాగే, స్పీకర్ తన అధికారంతో సప్లిమెంటరీ ప్రశ్నలకు అవకాశమిస్తే శాసన సభ్యుడిగా ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న హరీష్ అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. సభా నిబంధనలు తెలియవా అంటూ హరీష్ ను రేవంత్ డిఫెన్స్ లో పడేయడంతో ఆయన సైలెంట్ కావాల్సి వచ్చింది.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అసెంబ్లీలో మాట్లాడుతున్నారంటే తన ప్రశ్నలతో ప్రత్యర్ధులను చిక్కులో పడేసే నైపుణ్యం ఉన్న హరీష్.. రేవంత్ సమాధానాలకు మాత్రం ట్రబుల్ లో పడుతుండటం గమనార్హం.