ఓటుకు నోటు కేసులో.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ విచారణ… చంద్రబాబు వద్దకు వెళ్తోందా..? అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి. రెండు రోజుల పాటు ఈడీ విచారణకు హాజరైన ఆయన… కేసీఆర్ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. ఈడీ అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. విచారణ పేరుతో వేధిస్తున్నారని .. రెండు రోజుల పాటు అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారని చెబుతున్నారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు టార్గెట్గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని ప్రకటించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి నేరుగా చెప్పకపోయినా… ఈడీ అధికారుల టార్గెట్ చంద్రబాబేననేది.. రాజకీయవర్గాలకు తెలిసిన విషయం. ఓటుకు నోటు కేసు దాదాపు నాలుగేళ్ల కిందటిది. ఈ కేసు హైకోర్టులో ఎప్పుడో తేలిపోయింది. ఆ కేసులో చంద్రబాబును ఇరికించడం కష్టం కాబట్టి… ఐటీ శాఖ గత ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా.. ఈడీకి అప్పగించింది. ఆ యాభై లక్షలు ఎక్కడివో లెక్క తేల్చాలంటూ.. లేఖ రాయండతో.. హుటాహుటిన ఈడీ రంగంలోకి దిగింది. ఆ యాభై లక్షల ఆచూకీ కోసం.. ఎన్నికల ముందు… రేవంత్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఆఫీసుకు పిలిపించి విచారించారు. ఆ తర్వాత సైలెంటయిపోయారు. ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో.. మరోసారి ఈడీ అధికారులు విచారణ పేరుతో.. రేవంత్ రెడ్డి మరికొందర్ని పిలుస్తున్నారు.
ఈ కేసులో… సండ్ర వెంకయ వీరయ్య కూడా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవడతంో.. ఆయనకు ఈడీ ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదు. ఎలాంటి విచారణకు పిలవడం లేదు. కేవలం కొంతమందిని కొన్ని కేసులను టార్గెట్ గా చేసుకుని… ఈడీ విచారణ జరుపుతోంది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులే. పెద్ద ఎత్తున కేసులు ఉన్న ఇతర నేతలు మాత్రం.. హాయిగా బయట తిరుగుతున్నారు. కానీ.. ఏదో లింక్ పెట్టుకుని.. తమకు అడ్డుగా ఉన్న నేతలపై విరుచుకుపడుతున్నారు.. దానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని అడ్డు పెట్టుకుంటున్నారు.