తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసేంత వరకూ రేవంత్ రెడ్డి కాస్త ఓపికగా ఆగుతున్నారుగానీ, ఈలోగా కాంగ్రెస్ నేతలు ఆగలేకపోతున్నట్టుగా ఉంది! టీడీపీలో రేవంత్ ఎపిసోడ్ కు ఎలాగూ ఫుల్ స్టాప్ పడటం ఖాయంగానే కనిపిస్తోంది. చంద్రబాబు రాక అనే లాంఛనం కూడా పూర్తికాబోతోంది. ఆ తరువాత, కొంత విరామం తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ముందుగా, టీడీపీకి తాను ఎందుకు దూరం కావాల్సి వచ్చిందనేది చెప్పుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తారని చెప్పొచ్చు. ఆ తరువాత, కాంగ్రెస్ చేరిక గురించి మాట్లాడతారనే ప్రచారం ఉంది. అయితే, రేవంత్ ఇంకా ఏదీ స్పష్టంగా ప్రకటించకముందే కాంగ్రెస్ లో రేవంత్ రాక హడావుడి కనిపిస్తోంది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీయేసీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. కానీ, బీయేసీ మీటింగ్ కి ఆయన వెళ్లలేదు. అయితే, రేవంత్ రాకతో అక్కడున్న కాంగ్రెస్ నేతల్లో ఒకటే హడావుడి! అసెంబ్లీ ప్రాంగణంలోకి ఆయన అడుగు పెడుతుండగానే.. కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి లు రేవంత్ ను పలకరించారు. మీడియాతోపాటు ఇతర నేతల సమక్షంలోనే రేవంత్ ను ఆలింగనం చేసుకుంటూ, వెల్కమ్ అంటూ షబ్బీర్ అలీ చెప్పారు. పక్కనే ఉన్న పొంగులేటి కూడా రేవంత్ తో కరచాలనం చేసి కాసేపు మాట్లాడారు. విచిత్రం ఏంటంటే… ఇక్కడి నుంచి నేరుగా టీడీఎల్పీ కార్యాలయానికి రేవంత్ వెళ్లారు. కానీ, తనకు కేటాయించిన కుర్చీలో ఆయన కూర్చోలేదు. వేరే కుర్చీ తెప్పించుకుని పక్కనే వేసుకుని కూర్చున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతల ఆలింగనాల తరువాత, వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ, టీడీఎల్పీ నేతగాగానీ సమావేశంలో కూర్చుంటే బాగోదనే రేవంత్ ఇలా చేసి ఉంటారని చెప్పొచ్చు. పైగా, పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆదేశాలు ఉండనే ఉన్నాయి కదా.
ఎలాగూ రేవంత్ రాబోయేది కాంగ్రెస్ లోకే కదా! ఈ ముందస్తు పలకరింపులు, పులకరింపులు ఎందుకు చెప్పండీ. కొంచెం ఓర్చుకుంటే ఆ ముచ్చట ఎలాగూ తీరేదే కదా. రేవంత్ పార్టీలో చేరికను భారీ ఎత్తున నిర్వహించాలని కొందరు నేతలు ఇప్పటికే ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం! రేవంత్ రెడ్డి తొలిసారి గాంధీ భవన్ లోకి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలకాలనే ప్లాన్ తో కొంతమంది నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, టి. కాంగ్రెస్ కు రేవంత్ కళ వచ్చేసిందనే చెప్పాలి. అంటే, పార్టీలో ఆయనకు లభించబోతున్న ప్రాధాన్యతను కూడా ఈ హడావుడిని బట్టీ కొంత ఊహించొచ్చు. కాకపోతే, అసలే కాంగ్రెస్, అందునా అది తెలంగాణ కాంగ్రెస్… రేవంత్ విషయంలో కొంతమంది చేస్తున్న ఈ ముందస్తు హడావుడి అందరికీ ఆమోదయోగ్యమైన పరిణామమేనా అనే అనుమానం కచ్చితంగా ఉందనే చెప్పాలి.