తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదు. ఎందుకు పోటీ చేయడం లేదన్నది రకరకాల చర్చలు ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే.. బీఆర్ఎస్, బీజేపీకి సెటిలర్లు ఓట్లు వేయవద్దని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారిలో టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని.. ఆయనకు సపోర్ట్ చేయాలన్న వాదనను వినిపిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందో లేదో కానీ.. ఆయన మాత్రం టీడీపీ సానుభూతిపరులను ఆకట్టుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా వదిలి పెట్టడం లేదు. హైదరాబాద్ లో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అవసరం లేకపోయినా చంద్రబాబును పొగిడారు.
అమరావతి గురించి గొప్పగా చెప్పారు. టీడీపీ సానుభూతిపరులు రేవంత్ రెడ్డి అంటే మాకు ఇందుకే ఇష్టం అని చెప్పుకోకుండా ఎలా ఉంటారు ? వైఎస్ గొప్ప నేత అన్నట్లుగా ఇండియా టుడే యాంకర్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన మాత్రమే కాదని.. చంద్రబాబు, జైపాల్ రెడ్డి, పీవీ లాంటి వాళ్లు ఇంకా గొప్పనేతలు ఉన్నారని తేల్చేశారు. తర్వాత హైదరాబాద్ ను కూడా ఆమరావతిలా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. అమరావతి నది ఒడ్డున ఉంటుంది.. అద్భుతమైన ప్రాజెక్టు అని అన్నారు. ఆ తరహాలోనే మూసిని అభివృద్ధి చేసి.. హైదరాబాద్ ను కూడా రివర్ ఫ్రంట్ సిటీగా అభవృద్ధి చేయాలన్న ఆలోచనలు ఉన్నట్లుగా చెప్పారు. రేవంత్ మాటలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వెళ్లిపోయినా .. చంద్రబాబును ఎప్పుడూ విమర్శించారు.
ఈ విషయంపై తనపై బీఆర్ఎస్ తో పాటు ఇతర నేతలు నిందలేసినా పట్టించుకోరు. అందుకే.. టీడీపీ సానుభూతిపరులు మొదటి నుంచి రేవంత్ కు సపోర్ట్ గా ఉంటారు. ఈ సారి టీడీపీ పోటీలో లేకపోవడం వల్ల దీన్ని మరింత అడ్వాంటేజ్ గా తీసుకునేందురు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలిస్తాయో లేదో మరి !