ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ లో బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే. ఉద్యమ పార్టీ నుండి ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించాక… హైదరాబాదీలంతా ఆహా… ఓహో… ఐటీ మినిస్టర్ అంటే ఇలా ఉండాలంటే కేటీఆర్ ను ఓన్ చేసుకున్నాక మీరంతా ఆంధ్రా, మేము లోకల్ తెలంగాణ అనటం బీఆర్ఎస్ కు ఇరకాటమే.
నెత్తిన పెట్టుకుంటారనుకున్న పల్లె తెలంగాణ బీఆర్ఎస్ ను బొంద పెట్టినా, ఈ నాన్ లోకల్ అనే హైదరాబాదీలే అక్కున చేర్చుకున్నారు. కానీ వారినే దూరం చేసుకునేలా కౌశిక్ రెడ్డి చేసిన తప్పు ఇప్పుడు పార్టీలోనూ చర్చనీయాంశంగా మారిపోయింది.
నిజానికి ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్ కూడా చాలా రియాక్ట్ అయ్యింది. పీఎసీ చైర్మన్ పోస్టులో కాంగ్రెస్ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్న సందర్భంలో… బీఆర్ఎస్ పార్టీ పక్కాగా అరికెపూడి గాంధీని ఉచ్చులోకి లాగింది. తన చుట్టే రాజకీయం నడిచేలా చేసింది. కానీ, కౌశిక్ రెడ్డి చేసిన ఆ ఒక్క కామెంట్ బీఆర్ఎస్ లో ఉద్యమ బ్యాచ్ ను, బీటీ బ్యాచ్ ను వేరు చేసేసింది.
అయితే, ఎప్పట్లాగే కాంగ్రెస్ రియాక్ట్ కావటం ఆలస్యం అయినా… సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూలోకి కేసీఆర్ కుటుంబాన్ని లాగేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్ కుటుంబ సభ్యులు సమర్థిస్తారా అని మండిపడ్డారు. దీనికి తోడు అరికెపూడి గాంధీ కూడా నేను బతకొచ్చిన వాడినే అయితే, నాకు ఓట్లేసిన వారు బతకొచ్చిన వారే అయితే కేసీఆర్ రెస్పాండ్ కావాలని డిమాండ్ చేశారు. తప్పు అనుకుంటే కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయండి, నిజమే అనుకుంటే బహిరంగంగా సమర్థించండి అంటూ ఇరకాటంలో పెట్టేశారు. దీనికి తోడు పోలీస్ ఉన్నతాధికారిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసు ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది. స్వయంగా హరీష్ రావు వచ్చి, కౌశిక్ రెడ్డిని పక్కకు తోసేస్తే తప్పా అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదు. కౌశిక్ రెడ్డి దూకుడు పార్టీకి తెచ్చిన మైలేజ్ కన్నా ఓట్ల రూపంలో నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.