తెలంగాణలో కేసీఆర్ తో పోటీపడే రాజకీయ నాయకులు ఎవరు అంటే ఐదేళ్ల కిందట బలంగా ఎవరి పేరూ చెప్పలేకపోయారు. ఎప్పటికైనా రేవంత్ రెడ్డే అని చెప్పేవారు. తర్వాత రోజుల్లో బండి సంజయ్ కేసీఆర్ కు ధీటైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరికీ ఈ గుర్తింపు రావడానికి కారణం… ఎన్ని వేధింపులకు గురి చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని సార్లు జైలుకు పంపినా వీరు కేసీఆర్ పోరాటంలో ఇసుమంత కూడా రాజీ పడకపోవడం. అదే వీరిద్దర్ని ప్రత్యేకమైన నాయకులుగా నిలబెట్టింది. రేవంత్ రెడ్డి ఇప్పుడా నమ్మకన్ని నిజం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు.
17 ఏళ్లలోనే సీఎం స్థానాన్ని అందుకున్న రేవంత్
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే.. ఆయన తాను ఏదైతే సాధిచాలనుకున్నారో దాని కోసం రాజీ పడే రకం కాదని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆయనేమీ రాజకీయ కుటుంబంలో పుట్టలేదు. ఆర్థికంగా స్థితివంతమైన కుటుంబంలోనూ జన్మించలేదు. పూర్తి స్థాయిలో స్వయంకృషితోనే అడుగు పెట్టారు. మొదట టీఆర్ఎస్ పార్టీలోనే కీలకంగా పని చేశారు.కానీ కేసీఆర్ టిక్కెట్ నిరాకరించడంతో తన సొంత రాజకీయ బాట చూసుకున్నారు. మొదట జడ్పీటీసీగా .. తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్ గా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీలో చేరారు. మొత్తంగా పదిహేడేళ్లలోనే ఆయన ఉన్న స్థానాన్ని అందుకున్నారు.
కాంగ్రెస్ రాజకీయాలకు తగ్గట్లుగా మారిన నేత
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని పొందడం అంత తేలిక కాదు.కానీ రేవంత్ దాన్ని చేసి చూపించారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. పార్టీలో చేరిన చాలా కాలం వరకూ ఆయనను ఖాళీగా ఉంచారు. చివరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కానీ చేతులు కెట్టేశారు. ఆ సమయంలో ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారన్న ప్రచారం జరిగింది. అది కూడా కాంగ్రెస్ నేతలే చేశారు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కుని నేడు సీఎం అవుతున్నారు.
ఎవర్ని ఎలా డీల్ చేయాలో తెలిసిన లీడర్ !
కాంగ్రెస్లో బలహీన సీఎం ఉంటే.. నేతలు ఎలా ఆడుకుంటారో అందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి అలా ఆడుకోనిచ్చే అవకాశం ఉండదు. తానే ఆడుకుంటారు. తాము ఎప్పటి నుండో కాంగ్రెస్ లో ఉన్నామన్న ఒకే ఒక్క పాయింట్ ను పట్టుకుని…తమకు పదవులు కావాలని.. ప్రాధాన్యం కావాలని.. పార్టీలో లేనిపోని రచ్చ చేసే వారిని రేవంత్ కంట్రోల్ చేయగలరు. తెలంగాణ కాంగ్రెస్ ఇక నుంచి రేవంత్ రెడ్డి శకం ప్రారంభమైందని అనుకోవచ్చు.